హైదరాబాద్ జంట నగరాల్లో పోలీసులు చేపడుతున్న (కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్) ముమ్మర తనిఖీలలో భాగంగా… ఇప్పటికే పలు ప్రాంతాలను చుట్టుముట్టి పెద్ద సంఖ్యలో నేరగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసుల అడుగులు సోమవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పరిధిలోని కృష్ణానగర్ లో పడ్డాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో రంగంలోకి దిగిన 400 మంది పోలీసులు కృష్ణానగర్ తో పాటు యూసుఫ్ గూడ పరిధిలోని పలు ఇళ్లల్లో సోదాలు చేసారు.
ఎటువంటి సమాచారం లేకుండా జరిపిన ఈ సోదాలలో అనుమానంగా కనిపించిన 46 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గుర్తింపు పత్రాలు లేని 46 బైకులతో పాటు 12 ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 46 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు ఇంటిలో ఉంటున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. సిటీని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా ఈ తనిఖీలు జరిపినట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టులకు నిలయమైన కృష్ణానగర్ లో వందలాది పోలీసులు ప్రత్యక్షం కావడం స్థానికంగా కలకలం రేగింది. ఎప్పుడూ సినీ కబుర్లతో కాలక్షేపం చేసే కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటన నివాసితుల్లో భయాందోళనలు నింపింది.



