
కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ చక్రం తిప్పుతున్నారని కొందరు, తానే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.
అయన ఢిల్లీ పెద్దలతో పరిచయాలు పెంచుకొని రాజకీయ భవిష్యత్తుకి రాజబాట వేసుకుంటున్నారని సన్నాయి నొక్కులు వినిపిస్తూనే ఉన్నాయి.
నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ చక్రం తిప్పుతుంటే ఎవరికీ తప్పు అనిపించలేదు. పైగా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేవారు. లేదా అలా చెప్పుకునేలా చేశారు.
కానీ చంద్రబాబు నాయుడు తాను గెలిచి, తన వారిని గెలిపించుకున్నారు. తన ఎంపీలను కేంద్ర మంత్రులును చేసుకున్నారు. వారితో రాష్ట్రానికి కూడా మేలు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్, జగన్ ఏం చేశారు?
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధాని అయిపోవాలనుకున్నారు. ఆయన రాజకీయ దురాశకు కొడుకు కేటీఆర్ భవిష్యత్ బలైపోయింది.
ఒకానొక సమయంలో కూతురు కవితకి కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశం కలిగింది. కానీ కేసీఆర్ కేంద్రంపై కత్తులు దూయడం వలన కేంద్ర మంత్రి కావలసిన ఆమె తీహార్ జైల్లో గడపాల్సి వచ్చింది! జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమెను పార్టీ నుంచి బహిష్కరించి ఆమె రాజకీయ భవిష్యత్‌ని నాశనం చేశారు కదా?
కేసీఆర్ దాదాపు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఒక్క బీఆర్ఎస్ ఎంపీకి కేంద్ర మంత్రి ఇప్పించుకోలేకపోయారు. కారణం రాజకీయ దురాశ… రాజకీయ శత్రుత్వానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే కదా?
ప్రజలు జగన్‌కి ఇంతకంటే చాలా గొప్ప అవకాశమే ఇచ్చారు. కానీ అయన దాని విలువ గుర్తించలేకపోయారు. ఆయాచితంగా లభించిన పదవి, అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు కదా?
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోడీని తరచూ కలుస్తుండేవారు. కనుక ఆ బంధాలను బలపరుచుకునే అవకాశం ఆయనకీ ఉండేది. కానీ కులాలు, మతాల ఓట్ బ్యాంక్ లెక్కలు కట్టుకొని బీజేపితో చేతులు కలపడానికి భయపడ్డారు.
కానీ చంద్రబాబు నాయుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనిలో తప్పేమిటి?
ఇప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా కాలేని పరిస్థితి. కానీ కేసీఆర్ అస్త్ర సన్యాసం చేసి పార్టీని కొడుకు కేటీఆర్ చేతిలో పెట్టేశారు. కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గెలిపింకుంటే అప్పుడు తప్పకుండా ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కాగలరు. అది తప్పు కానప్పుడు నారా లోకేష్ రాజకీయ ఎదుగుదలని ఎలా తప్పు పట్టగలరు? రాజకీయాలలో ఇదేమీ నేరం కాదు కదా?
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసిన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. కుదిరితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. కేటీఆర్ అనుకున్నారు. కవిత కూడా అనుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు అందరూ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు.
వారందరూ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తప్పు కానప్పుడు భవిష్యత్తులో ఎప్పుడో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేమిటి?
అయినా సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ తమకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంటే అది తెలివైన రాజకీయ నాయకులు చేసే పనిగా చూడాలి. కానీ కోడిగుడ్డుకి ఈకలు పీకడం దేనికి?
The NDA leadership in Andhra Pradesh has repeatedly raised concerns about alleged attempts to create…
Ram Charan fans have plenty of reasons to be frustrated with Peddi. The film had…