కొరటాల శివ, జూ.ఎన్టీఆర్, జాహ్నవిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 ఏప్రిల్‌కు 5వ తేదీకి విడుదల కావలసి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యమవుతుండటంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వినిపిస్తున్న ఊహాగానాలను దేవర టీమ్ వెంటనే ఖండించింది. ఏప్రిల్‌కు 5వ తేదీన ఖచ్చితంగా విడుదలవుతుందని స్పష్టం చేసింది.
కానీ ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16వ తేదీకి కాస్త అటూఇటూగా జరగవచ్చని భావిస్తూ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఢిల్లీ ఎన్నికల కమీషన్ అధికారి వ్రాసిన లేఖతో దేవర సినిమా వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
ఒకవేళ ఏప్రిల్ 16వ తేదీ నుంచే ఎన్నికలు మొదలవుతాయనుకున్నా, వాటికి ఒకటి రెండు నెలల ముందు నుంచే రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి 16 లేదా ఎన్నికలు ముగిసే వరకు ప్రచారం చాలా ఉదృత స్థాయిలో జరుగుతుంటుంది. ఆ సమయంలో సినిమాని విడుదల చేయడం చాలా రిస్కే.
పైగా ఆంధ్రాలో టిడిపి, వైసీపిల మద్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో జూ.ఎన్టీఆర్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. కనుక జూ.ఎన్టీఆర్ సినిమా దేవరపై కూడా ఈ రాజకీయ ప్రభావం, ఒత్తిళ్ళు పడే అవకాశం కూడా ఉంటుంది.
కనుక దేవర వాయిదా వేసుకోక తప్పదు లేదా ఏమైతే అదే అవుతుందని తెగించి బరిలో దిగిపోవలసి ఉంటుంది. దేవర ఆగస్ట్ 15వ తేదీకి వాయిదా పడవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై దేవర టీమ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.




