
వైసీపిలో సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావుల స్టయిలే వేరు. వారిద్దరూ తాము చాలా తెలివిగా మాట్లాడుతున్నామని భావిస్తూ ఏదేదో మాట్లాడేస్తూ చివరికి ప్రజలు వైసీపినే అనుమానించేలా చేస్తుంటారు.
విశాఖను రాజధాని చేయకపోతే విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని మంత్రి ధర్మాన ఆ మద్యన డిమాండ్ చేయడంతో ఆయనపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మద్య ప్రాంతీయ చిచ్చుపెడుతున్నది చాలాక వైసీపీ నేతల పదవులు, అధికారం కోసం రాష్ట్రాన్ని మరోసారి విభజన చేయడానికి కూడా వెనకాడరా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వాటికి జవాబు చెప్పుకోలేక వైసీపి చాలా ఇబ్బంది పడింది. ప్రస్తుతం టిడిపి, జనసేనలు ఆంధ్రాలో గుంతలు పడిన రోడ్ల పరిస్థితిని వైసీపి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటికి మరమత్తులు చేసేందుకు ఒత్తిడి చేస్తున్నాయి. వైసీపి పాలనలో కనీసం రోడ్ల మరమత్తులు కూడా చేయలేకపోతోందని విమర్శిస్తున్నాయి.
మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ చాలా విచిత్రంగా మాట్లాడారు. శ్రీకాకుళంలో సామాజిక సాధికార యాత్రలో ఆయన ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో రోడ్లు బాగుచేయవలసిన బాధ్యత మా ప్రభుత్వానిదే. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి మాకు మరికొంత సమయం అవసరం. అయితే ఎక్కడో ఓ రోడ్డు చూపించి ఆ రోడ్డు బాగోలేదు కనుక ఈ ప్రభుత్వం బాగోలేదనడం సబబేనా?జస్ట్ ఆ ఒక్క రోడ్డు వేసేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిపోతాయా? మా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తూ ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టింది.
రాష్ట్రంలో రోడ్లు గుంతలు పడ్డాయి మరమత్తులు చేయించమని ప్రతిపక్షాలు చెపుతుంటే, వాటితో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అంటూ బోడి గుండుకీ మోకాలికి ముడివేస్తున్నట్లుంది మంత్రి ధర్మాన మాట్లాడటం విచిత్రంగా ఉంది కదా?
ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాలో రోడ్లను మరమత్తులు చేయడానికి నాలుగున్నరేళ్ళ సమయం సరిపోలేదట! ఇంకా సమయం కావాలట! ఇద్దరు మంత్రులు కలిసి ఒక్క శ్రీకాకుళం జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారంటే విశాఖ రాజధాని కానీయకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడం వలననేనట!
విశాఖ రాజధాని కావడానికి, శ్రీకాకుళంలో రోడ్లు వేయడానికి, అలాగే రాష్ట్రంలో రోడ్లు మరమత్తులు చేయకపోవడానికి, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధం ఏమిటో తెలీదు. కానీ మంత్రి ధర్మాన మాత్రం తమ ప్రభుత్వ అసమర్ధతను, వైఫల్యాలను తెలివిగా కప్పి పుచ్చుకొంటున్నారని అర్దమవుతోంది కదా?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…