
వచ్చే నెల (జూన్) 2వ తేదీతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ రోజు నుంచే హైదరాబాద్ ‘ఉమ్మడి రాజధాని హోదా’ రద్దయ్యి ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా మారుతుంది. కానీ అవసరమైతే హైదరాబాద్‌ని ‘ఉమ్మడి రాజధాని’గా కొనసాగించేందుకు విభజన చట్టంలో వెసులుబాటు ఉన్నందున మరో పదేళ్ళపాటు పొడిగించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాష్ట్రపతి ముర్ముకి ఓ లేఖ వ్రాశారు.
అయితే రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ళ తర్వాత కూడా ఏపీకి రాజధాని ఏర్పాటు చేసుకోలేక ఇంకా హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరడం ఆంధ్ర ప్రజలకు అవమానమే కదా?
రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిన్నరలోపే చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులు అందరినీ విజయవాడ రప్పించేశారు. అందుకు ఆయనపై పలువురు పలు రకాలుగా విమర్శించినా, పరాయి ఇంట్లో ఉండటం కంటే మన ఇంట్లో మనం ఉండటమే గౌరవమని తర్వాత అందరూ గ్రహించారు.
మనకీ ఓ గొప్ప రాజధాని ఉండాలని, అది హైదరాబాద్ కంటే మిన్నగా ఉండాలని చంద్రబాబు కలలు కన్నారు. అమరావతికి శ్రీకారం చుట్టి సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర అనేక భవనాలను నిర్మించారు. ఆనాడు ఆయన నిర్మించిన ఆ భవనాలలోనే కూర్చొని నేటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు.
అదే… జగన్ కూడా అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసి ఉండి ఉంటే నేటికీ దానికి ఓ రూపురేఖలు వచ్చి ఉండేవి. చక్కటి రాజధాని నగరం, రాజకీయాలలో నిలకడతనం ఉంటే ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు ప్రవాహంలా వచ్చి పడేవి. వాటితో రాష్ట్రాభివృద్ధి, ఆర్ధికాభివృద్ధి జరిగి ఉండేది కదా?
కానీ జగన్ అమరావతిని పాడుబెట్టడమే కాకుండా ఈ 5 ఏళ్ళలో కనీసం విశాఖ రాజధానిని ఏర్పాటు చేయలేకపోయినందునే దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ఇందుకు సిగ్గు పడాల్సింది పోయి, “మాకు రాజధాని లేదు కనుక మరో రెండేళ్ళు హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించమని” వైసీపి నేతలు, మరో పదేళ్ళు కొనసాగించాలని లక్ష్మినారాయణ కోరుతుండటం సిగ్గుచేటు.
మన అసమర్దతకి, మన అనాలోచిత రాజకీయ నిర్ణయాలకు పొరుగు రాష్ట్రం ఎందుకు బాధ్యత వహించాలి?అని ఆలోచిస్తే ఈ ఉమ్మడి రాజధాని ప్రతిపాదనలు ఎంత అవివేకమో అర్దమవుతుంది.
మరో పది రోజులలో ఏపీలో ఎలాగూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. టిడిపి కూటమి గెలిచి అధికారంలోకి రాగానే అమరావతి పనులు మొదలుపెట్టి పూర్తిచేస్తామని చంద్రబాబు నాయుడు చెపుతున్నారు.
ఒకవేళ వైసీపి వస్తే జగన్మోహన్ రెడ్డి జూన్ 9న విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తారని, విశాఖను రాజధానిగా చేస్తామని చెపుతున్నారు. కనుక ఎవరు వచ్చినా ముందుగా ఏపీకి రాజధాని ఏర్పాటు కాబోతోందని అర్దమవుతోంది. మరి అటువంటప్పుడు ఇంకా హైదరాబాద్ కోసం ఆశపడటం దేనికి?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…