‘బాహుబలి 2’ అపూర్వ విజయం సాధించిందని ఖరారైన తర్వాత చైనాలో విడుదలైన అమీర్ ఖాన్ ‘దంగల్’ అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవడంలో సక్సెస్ సాధించింది. ఒక్క చైనా మార్కెట్ లోనే ఇండియాకు మించిన స్థాయిలో కలెక్షన్లు వస్తుండడం ట్రేడ్ పండితులను నివ్వెరపరుస్తోంది. శనివారం నాటి కలెక్షన్స్ తో మొత్తం 100 మిలియన్లు దాటిన ఈ మొత్తం విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 650 కోట్లు. అయితే ఇది ఇక్కడితో ఆగేలా కనపడడం లేదు.
అసలు ట్విస్ట్ ఏమిటంటే… సాధారణంగా సినిమా విడుదలైన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ కలెక్షన్ల ఒరవడి తగ్గుముఖం పడుతూ ఉండాలి. కానీ చైనాలో ‘దంగల్’ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉండడం అనేక సందేహాలకు తావిస్తోంది. ‘దంగల్’ విడుదలైన మొదటి శనివారం నాడు ఈ సినిమా 4.1 మిలియన్స్ వసూలు చేయగా, రెండవ శనివారం అది మూడు రెట్లు పెరిగి 12.4 మిలియన్స్ కు చేరుకుంది. ఇక మూడవ శనివారం అయితే ఏకంగా 15.3 మిలియన్స్ వసూళ్లు చేసి ఈ సమ్మర్లో కళ్ళు తిరిగేలా చేసింది.
చైనాలో సాధిస్తున్న ఈ కలెక్షన్ల ఒరవడితో ఆల్ టైం నెంబర్ 1 స్పాట్ కు ‘దంగల్’ అతి కొద్ది దూరంలో మాత్రమే నిలిచింది. అంటే ‘బాహుబలి 2’ సినిమాను అధికారికంగా దాటడానికి సిద్ధంగా ఉందన్న మాట. అయితే ఆశ్చర్యకరంగా అంతకంతకూ చైనా కలెక్షన్లు పెరుగుతూ ఉండడం, బహుశా అక్కడ ప్రేక్షకులు, ఇండియన్ ఆడియన్స్ మాదిరి ముందే ఎగబడి చూసేయరా? అన్న ప్రశ్నలను మిగులుస్తోంది. చూడబోతుంటే… ఒక్క చైనా మార్కెట్ లోనే అమీర్ ఖాన్ “దంగల్” 1000 కోట్లు సాధిస్తుందన్న నమ్మకం బలపడుతోంది.
ఒకవేళ అంచనాలకు మించి 1200 కోట్లు దాకా కొల్లగొడితే మాత్రం, 2000 కోట్లు అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా “దంగల్” రికార్డులు సృష్టించడం ఖాయం! ‘బాహుబలి 2’ విడుదల తర్వాత ‘ఖాన్’ త్రయం హవాకు బ్రేకులు పడ్డాయని జాతీయ, స్థానిక మీడియాలు కోడై కూసిన విషయం తెలిసిందే. అయితే అతి కొద్ది రోజులకే అమీర్ ‘ఖాన్’ చైనా మార్కెట్ లో “దంగల్” రూపంలో సత్తా చూపడంతో, బాక్సాఫీస్ వద్ద మళ్ళీ ‘ఖాన్’ దాదాగిరి చర్చనీయాంశంగా మారింది. అంటే పవన్ చెప్పినట్లు… ‘దక్షిణాది’పై ‘ఉత్తరాది’ ఆధిపత్యం కొనసాగుతున్నట్లేనా..?!



