
ఈటెల రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ రాజకీయాలకు పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు బిఆర్ఎస్ కోర్ లీడర్ గా ఎదిగిన ఈటెల బిఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక పాత్ర పోషించారు. నీటి పారుదల శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఇలా ప్రభుత్వంలోని కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఈటెల రాజేంద్ర ప్రసాద్ కు ప్రజాదరణ కూడా పుష్కలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తరువాత స్థానంలో, హరీష్ రావు కు సమానమైన స్థానంలోనూ బిఆర్ఎస్ లో ఈటెల హవా కొనసాగించారు.
అయితే బిఆర్ఎస్ అధిష్టానంతో వచ్చిన రాజకీయ విభేదాలతో పార్టీని వీడిన ఈటెల 2021 లో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే నాడు ఈటెలకు ఉన్న రాజకీయ ఛరిష్మా కు గాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత బీసీ సీఎం అభ్యర్థిగా చేస్తామంటూ బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు వార్తలు ప్రచారమయ్యాయి.
అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఏ దశలోనూ తన హామీలను నిలబెట్టుకునేలా ఈటెల అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది. బండి సంజయ్ అధ్యక్ష మార్పు సమయంలో ఆయన స్థానంలో ఈటెలకు బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తుంది అని ఎదురుచూసినప్పటికీ కిషన్ రెడ్డి ఎంపిక తో ఈటెలకు మొండి చెయ్యి చూపింది బీజేపీ.
2023 అసెంబ్లీ ఎన్నికలలో హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల ఊహించని రీతిలో ఓటమి చెందారు. గతంలో ఏడూ ఎన్నికలలో వరుస విజయాలు సాధించిన ఈటెలకు ఈ ఓటమి ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక 2024 ఎన్నికలలో మల్కాజ్ గిరి నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం అందుకున్నారు.
ఇక అప్పటి నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో పోటీపడుతున్న ఈటెలకి ప్రతిసారి అధిష్టాన నిర్ణయంతో నిరాశే ఎదురవుతుంది. తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్. రామచందర్ రావు పేరు ఖరారు చేయడంతో ఈటెలకు ఈసారి కూడా బీజేపీ అధిష్టానం మొండి చెయ్యి చూపినట్టే అయ్యింది.
ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనా పరమైన విషయాలలో అవగాహనా, తెలంగాణ రాజకీయ విధానాల పై స్పష్టతతో పాటుగా ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతల మీద పూర్తి అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం ఈటెలను పక్కన పెట్టడం బిఆర్ఎస్ కు మద్దతు పలకడమే అవుతుంది.
అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామజిక వర్గ నాయకుడిగా ఉన్నప్పటికీ ఈటెల ఇలా బీజేపీ పార్టీలో గుర్తింపు, గౌరవం కోసం ఎదురు చూసి మోసపోవడంలో ఆయను తిరిగి బిఆర్ఎస్ లోకి వచ్చేయాలంటూ ఈటెల మద్దతుదారులు కోరుకుంటున్నారు.
అయితే కేసీఆర్, ఈటెల మధ్య జరిగిన రాజకీయ పరిణామాలతో అది సాధ్యమవుతుందా.? అన్న ప్రశ్న ఎదురవుతుంది. అలాగే ఇటు ఇన్నాళ్ళుగా బీజేపీ అధిష్టానం తన పై చూపుతున్న సీత కన్ను ను తట్టుకుని ఈటెల బీజేపీ తో కలిసి ప్రయాణం చేయగలుగుతారు.? ఇలా ఈటెల రాజకీయ ప్రయాణానికి దారెటు అనేలా పరిస్థితులు మారుతున్నాయి.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…