
రాజకీయ పార్టీలు ఎన్నికలలో వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకొని గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ఎడాపెడా హామీలు, సంక్షేమ పధకాలు ప్రకటిస్తుంటాయి. సమాజంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపితే మంచిదే. కానీ ఆ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలుచేయలేక అవస్థలు పడుతుంటాయి.
అందుకు ప్రతిపక్షాల నుంచి విమర్శలు భరించాలి. ఆ హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న వర్గాల ప్రజల ఆగ్రహం, అసహనం నిప్పులా రాజుకోకుండా ఎప్పటికప్పుడు ఒకటీ అరా పధకాలు చిలకస్తుండాలి.
మళ్ళీ ఆ భారం ప్రజలపైనే వేయాలి… వేస్తే ప్రతిపక్షాలు ఊరుకోవు. ప్రజలను ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతాయి. కనుక ప్రజలపై భారం వేయకూడదంటే ఎడాపెడా అప్పులు చేయక తప్పదు.
అలా చేసినా ప్రతిపక్షాలు ఊరుకోవు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోందని విమర్శలు గుప్పిస్తాయి. అంటే హామీలతో అధికారం చేజిక్కించుకోవడం అంటే అదో ఓ చక్ర వ్యూహంలా మారుతుందన్న మాట.
ఈ హామీలు, పధకాలతో జరిగే నష్టం ఇక్కడితో ఆగుతుందా అంటే కాదనే చెప్పాలి. వీటితో సవ్యంగా పనిచేస్తున్న వ్యవస్థలు కూడా కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతోంది.
ఉదాహరణకు ఏపీలో స్త్రీ శక్తి, తెలంగాణలో మహాలక్ష్మీ పధకాలతో ఆర్టీసీ క్రమంగా నష్టాల ఊబిలో కూరుకుపోయి మూతపడే ప్రమాదం పొంచి ఉంది.
ఈ పధకాలు ప్రవేశపెట్టమని మహిళలు అడగలేదు. కానీ వారి ఓట్ల కోసమే ప్రకటించి రెండు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
కనుక ఈ భారాన్ని ప్రభుత్వాలే భరిస్తున్నాయి. కానీ ప్రభుత్వాల వద్ద డబ్బు లేదు! ఎందువల్ల? అంటే తలకు మించిన హామీలు, పధకాలు అమలుచేయాల్సి రావడం… వాటి కోసం గత ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలు చేసిన అప్పులు, వడ్డీలకే ప్రభుత్వ ఆదాయం వెళ్ళిపోతుండటం!
కనుక ఆర్టీసీకి సకాలంలో చెల్లించక వాటి బకాయిలు పెరుగుతూనే ఉంటాయి. చివరికి అవి దివాళా తీస్తే ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డున పడతారు. వాటినే నమ్ముకున్న సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ లేకపోతే నష్టపోతారు.
మహాలక్ష్మి పధకంతో తెలంగాణలో ఆర్టీసీ నష్టపోతుంటే, తాజాగా హైదరాబాద్ మెట్రో పగ్గాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతోంది.
త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలున్నాయి. కనుక మెట్రోలో కూడా మహాలక్ష్మీ పధకం ప్రవేశ పెట్టాలనుకుంటే?ఇప్పటికే నష్టాల ఊబిలో ఉన్న మెట్రో పూర్తిగా మునుగుతుంది.
ఇలా ఎన్నికల హామీలు కొంప ముంచుతున్నా రాజకీయ పార్టీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎందుకంటే, ఎన్నికలలో గెలుపు ముఖ్యం తప్ప ఈ ఆర్ధిక భారంతో వాటికి సంబంధం ఉండదు కనుక. ఈ అప్పులు, వడ్డీలు, నష్టాలు, భారానికి అవి కానీ వాటి ప్రభుత్వాలు గానీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదు కనుక!
Dasara is turning into another Sankranti of sorts at the Telugu box office, with several…
Salman Khan’s Maatrubhumi might arrive in theatres now that the major issues have been resolved.…