
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, లోపాలపై ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు.
ఎన్నికల యంత్రాంగంపై పాలక పక్షాలు ఒత్తిడి చేస్తూ ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్నాయి.
కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌ళ ఏర్పాటులో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వాదిస్తున్నారు.
కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు కదా? వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారు కదా? ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణచివేయలనుకున్నారు కదా?
ఇప్పుడు రాహుల్ గాంధీ లేదా వైసీపీ లేదా మరొకరు ప్రతిపక్షంలో వచ్చి పడ్డాక వ్యవస్థలన్నీ సక్రమంగా, నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలంటే పనిచేస్తాయా?
రాజకీయాలలో ఉన్నవారు… ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజకీయాలను దిగజారిస్తే, తప్పకుండా ఏదోరోజు వారు కూడా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో వైసీపీ, బీఆర్ఎస్ వంటి పార్టీల ఓటములు, అవి ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలే ఇందుకు చక్కటి నిదర్శనం… కాదా?
అవే కాదు… దేశంలో ఏ రాజకీయపార్టీ అయినా రాజకీయాలని దిగజార్చితే దానికి తప్పకుండా అవి కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
ఇది పదేపదే నిరూపించబడుతున్నప్పటికీ రాజకీయాలలో ఉన్నవారు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు తాము వీటన్నిటికీ అతీతులమని భావిస్తుంటారు. తర్వాత కేసీఆర్, కేటీఆర్, జగన్ రాహుల్ గాంధీలా తాపీగా బాధపడుతుంటారు.
ఎన్నికల ప్రక్రియలో అక్రమాల గురించి రాహుల్ గాంధీ లేదా మరొకరు చేపుతున్నవి నిజమే కావచ్చు. కానీ వారు ఎంతగా గొంతు చించుకుంటున్నప్పటికీ ఈ వ్యవస్థలను ఎవరూ మార్చలేరు. లోపభూయిష్టమైన ఈ వ్యవస్థలు, విధానాలు, పద్దతులలోనే ఎన్నికలు జరుగుతుంటాయి.
ఇప్పుడు అవినీతి, అక్రమం, అన్యాయం అని గొంతు చించుకుంటున్న వారు కూడా, అప్పడు ఎన్నికలలో ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకునేందుకు అడ్డుదారులు తొక్కకుండా ఉండరు.
కనుక బురదలో నడుస్తూ కాలికి, బట్టలకు బురద అంటుకుందని వగచి ఏం ప్రయోజనం?
రాజకీయ పార్టీలు వ్యవస్థలలోకి అవినీతి, అక్రమాలు జొప్పిస్తూ సక్రమంగా, నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలని కోరుకోవడం దురాశే కదా?
కనుక ఇవే లోపాలతో కూడిన వ్యవస్థలు, యంత్రాంగం, పరిస్థితులలోనే పోటీ చేసి విజయం సాధించాల్సి ఉంటుందని గ్రహిస్తే మంచిది. ఒకవేళ గెలవలేమనుకుంటే రాజకీయాల నుంచి తప్పుకోవడం ఒకటే మార్గం!
కానీ ఎవరూ తప్పుకోవాలని అనుకోవడం లేదు! మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. కడిగేస్తాం… తొక్కేస్తాం…కోసేస్తాం…. నరికేస్తాం… అంటున్నారు. అంటే రాజకీయాలు, వ్యవస్థలు మున్ముందు మరింత పతనం కాబోతున్నాయన్న మాట! మరెందుకీ కంఠ శోష?
An extremely racist poster revealed by the Department of Homeland Security (DHS) has triggered a…
East Zone won the Duleep Trophy after 13 years as their final against South Zone…