
Erravalli Land Survey Raises Questions Over 45 Acres
ఫలానా అబ్బాయి లేదా అమ్మాయి కనిపించుట లేదు. మా పెంపుడు కుక్క కనిపించుట లేదు.. వంటి వార్తలు తరచూ చూస్తూనే ఉంటాము. రైల్వే స్టేషనలు, బస్టాండ్ల గోడలపై తప్పిపోయిన వారి ఫోటోలు చూస్తూనే ఉంటాము. కానీ ఒక ఊర్లో 45 ఎకరాల భూమి కనిపించకుండా మాయం అయితే? ఎక్కడ వెతకాలి? ఎలా కనిపెట్టాలి?
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఫామ్‌హౌసు ఉన్న ఎర్రవల్లి గ్రామంలో ఇదే జరిగింది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్: 325లో 388 ఎకరాలు ఉండాలి. కానీ ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు సర్వే జరిపితే 343 ఎకరాలు మాత్రమే కనిపిస్తోంది. మరి మిగిలిన 45 ఎకరాలు ఎక్కడ? ఎలా మాయం అయిపోయాయి?
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు నేడో రేపో ఎర్రవల్లిలో కేసీఆర్‌తో సహా గ్రామంలో పలువురికి నోటీసులు జారీ చేయబోతున్నారు.
వారి భూ రికార్డులు పరిశీలించిన తర్వాత ఎవరి ఆధీనంలో ఆ ఎకరాలున్నాయో గుర్తించి స్వాధీనం చేసుకోవాలనేది యాక్షన్ ప్లాన్.
ఒకవేళ అవి కేసీఆర్ ఫామ్‌హౌసు కాంపౌండ్ వాల్ లోపలే ఉన్నట్లయితే, ఈ పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య మరో పెద్ద రాజకీయ యుద్ధం జరగడం ఖాయం.
ఆ భూములను స్వాధీనం చేసుకోగలిగితే రేవంత్ రెడ్డి విజయం సాధించినట్లు.. ప్రభుత్వ లేదా పేదల అసైన్డ్ భూములు కేసీఆర్ ఆక్రమించినట్లు నిరూపించగలుగుతారు.
ఇది కేసీఆర్ ప్రతిష్టకి భంగం కలిగిస్తుంది. అయన ప్రతిష్ట దెబ్బ తింటే బీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం కలుగుతుంది. కనుక ఇది ‘జస్ట్ రాజకీయ కక్ష సాధింపే’ అని వాదిస్తూ అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు.
ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులలో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ వివరాలు సేకరిస్తోంది. కనుక ఆ వివరాలు బయట పెట్టి సిఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు ప్రయత్నించవచ్చు.
ఈవిధంగా ఈ యుద్ధం ముగిసినట్లయితే, రెండు పార్టీలు రాజీ పడినట్లు భావించాల్సి ఉంటుంది. ఒకవేళ 45 ఎకరాలు స్వాధీనం చేసుకొని గ్రామస్తులకు, అమర వీరుల కుటుంబాలకు పంచి పెట్టగలిగితే, సిఎం రేవంత్ రెడ్డి వ్యూహాల ముందు కేసీఆర్, బీఆర్ఎస్ వ్యూహాలు ఎందుకూ పనికిరావని భావించాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో త్వరలోనే చూస్తాం.
The celebrities in the Bigg Boss house are unnecessarily spoiling their own game because they…
Aadarsha Kutumbam was supposed to hit theatres on October 9, but it was postponed as…