ఓ జీవిత ఖైదీ. జైలు నుంచి విడుదలయ్యాడు. మొదటి భార్యకు వైవాహికేతర సంబంధాలు ఉన్నాయని తెలుసుకొని రెండో పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్యకు కోపం వచ్చింది. అసలు కథ చెప్పేసింది. భర్తతో పాటు జైలు సూపరింటెండెంట్ కూడా కటకటకాలు పాలయ్యారు! ఎలా? ఇదిగో ఇలా…
బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శంకర్ ఆర్ముగం అనే వ్యక్తి జీవిత ఖైదీ. అతని భార్య తరచూ భర్తని కలిసేందుకు జైలుకు వస్తుండేది. ఈ క్రమంలో జైలు సూపరింటెండెంట్ సోమశేఖర్ ఆమెను శారీరికంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె చేత నగ్నంగా వీడియో కాల్స్ కూడా చేయించుకున్న మహా రసికుడు అతను. ఇందుకు ప్రతిగా తన భర్తను జైలు నుంచి విడుదలయ్యేలా చేయాలని ఆమె కోరింది. తన కామవాంచ తీర్చుతున్న ఆమె ఈ చిరు కోర్కెను కాదనలేకపోయాడు సోమశేఖర్. దీని కోసం ఓ అద్భుతమైన పధకం రచించాడు. శంకర్ ఆర్ముగం సద్ప్రవర్తనని పరిగణనలోకి తీసుకొని అతనిని జైలు నుంచి విడుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా జైలు గుమస్తా చేత సుప్రీంకోర్టు పేరిట ఓ నకిలీ లేఖ తయారుచేయించి ఆమెకు ఇచ్చాడు. దానిని ఆమె మళ్ళీ అతనికే సమర్పించింది. అవి సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు కనుక మరో ప్రశ్న అవసరం లేదన్నట్లు ఆమె భర్తని జైలు నుంచి విడుదల చేశాడు.
దీనిపై ఎవరికీ ఎటువంటి సందేహం ఏర్పడకపోవడమే విచిత్రమనుకుంటే, ఈ వ్యవహారం అనూహ్యంగా బయటపడటం ఇంకా విచిత్రం.
తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే సంగతి తెలుసుకున్న శంకర్ ఆర్ముగం, ఆమెను విడిచి పెట్టి 2018లో మరో మహిళను పెళ్ళి చేసుకున్నాడు. అతని కోసం తాను ఇంత త్యాగం చేస్తే, రెండో పెళ్ళి చేసుకుంటాడా?అని మొదటి భార్య ఆవేదనతో కుమిలిపోయింది. ఆ ఆవేదన, ఆగ్రహంగా మారి కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీకి జరిగిన విషయం తెలియజేస్తూ లేఖ వ్రాసేలా చేసింది.
అంతే! సుప్రీంకోర్టు పేరుతో నకిలీ ఉత్తర్వులు సృష్టించి, ఓ జీవిత ఖైదీని విడుదల చేసిన నేరానికి, ఖైదీ భార్యతో శృంగారం చేసినందుకుగాను సోమశేఖర్‌పై పోలీస్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అతనితో పాటు శంకర్ ఆర్ముగంని కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టు అనుమతితో ఈ నెల 9 వరకు సోమశేఖర్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
అతని విడుదలతో తాను అదే జైలులో గడపాల్సి వస్తుందని జైలు సూపరింటెండెంట్ సోమశేఖర్ గ్రహించి ఉండి ఉంటే? ఒకవేళ శంకర్ ఆర్ముగం రెండో పెళ్ళి చేసుకోకుండా బుద్దిగా భార్యతో కాపురం చేసుకొని ఉంటే?





