
మాజీ మంత్రి పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాములలో నిలువ ఉంచి బియ్యం మూటలు మాయం అయ్యాయని ‘లిఖిత పూర్వకంగా’ ప్రభుత్వానికి తెలియజేసి అడ్డంగా దొరికిపోయారు. కనుక ఆయన ఆందోళన చెంది ఉండాలి.
కానీ ఓ పక్క కూటమి ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తూనే, మరోపక్క సిఎం చంద్రబాబు నాయుడు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని పొగుడుతున్నారు!
“నా భార్య జయసుధని, కొడుకు కిట్టూని అరెస్ట్ చేయాలని నా రాజకీయ ప్రత్యర్ధి, మంత్రి కొల్లు రవీంద్ర చాలా తహతహలాడుతున్నాడు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు గారు, “ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళుతున్నావు?మన టార్గెట్ పేర్ని నానిగాడు కదా.. వాడిని లోపల వేసేయ్.. కావాలంటే వాడి కొడుకుని కూడా వేసేసుకుని నీ కక్ష తీర్చుకో కానీ ఆడాళ్ళ జోలికి వెళ్లొద్దు,” అని మంత్రి కొల్లుకి సిఎం చంద్రబాబు నాయుడుగారు మెత్తగా చీవాట్లు పెట్టారని పేర్ని నాని స్వయంగా చెప్పుకున్నారు.
ఇది వరకు చంద్రబాబు నాయుడు.. అంటూ ఏకవచనంలో సంభోదించిన పేర్ని నాని ఇప్పుడు ‘చంద్రబాబు నాయుడుగారు’ అంటూ మర్యాద ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలలో ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని పొగుడుతున్నారు కూడా.
కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు తనని, తన కొడుకుని లోపల వేసేసి కక్ష తీర్చుకోమని మంత్రి కొల్లు రవీంద్రకు పర్మిషన్ ఇచ్చేశారని చెప్పడం మైండ్ గేమ్ అనే చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడుని పొగుడుతూనే రాజకీయ కక్షలు తీర్చుకోమని తన పార్టీ నేతలను ప్రోత్సాహిస్తున్నారని పేర్ని నాని చెపుతున్నారన్న మాట.
రికార్డుల ప్రకారం ఆ గోదాముకి యజమాని పేర్ని నాని భార్య జయసుధ. కనుక అధికారులు చట్ట ప్రకారం ఆమెపైనే చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కానీ ‘ఆమె జోలికి వెళ్ళవద్దని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారని’ పేర్ని నాని అధికారులను కట్టడి చేసేందుకు గేమ్ ఆడుతున్నారు.
అంటే గోదాములో నిలువ ఉంచిన బియ్యం మాయం అయిపోయినా, యజమాని మహిళ.. అందునా.. రాజకీయ ప్రత్యర్ధి భార్య కనుక ప్రభుత్వం ఏమీ చేయకూడదని పేర్ని నాని ఆశిస్తున్నారన్నమాట.
చట్టంలో ఇటువంటి వెసులుబాటు ఉంటే ఆవినీతిపరులు అందరూ తమ ఇంట్లో ఆడవాళ్ళ పేరునే నిర్భయంగా అక్రమ వ్యాపారాలు చేసుకోవచ్చు కదా?
పేర్ని నాని భార్య జయసుధ పేరిట ఉన్న గోదాములో నుంచి బియ్యం మాయం అయినందుకు అధికారులు ఒకవేళ ఆమె భర్త పేర్ని నానిపై కేసు నమోదు చేస్తే అది కోర్టులో నిలుస్తుందా? నిలవదని ఎవరైనా చెపుతారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడుగారు ‘పేర్ని నాని గాడిని’ అరెస్ట్ చేసుకోమన్నారని అధికారులకు పేర్ని నాని సూచిస్తున్నారు.
రేషన్ దుకాణం నుంచి కేజీ బియ్యం దొంగతనం చేస్తే జనాలు పట్టుకొని చితకబాదుతారు. కానీ తన కుటుంబానికి చెందిన గోదాము నుంచి ఏకంగా రూ.1.70 కోట్లు విలువైన 37,88,660 కేజీల బియ్యం మాయం అయితే పట్టించుకోవద్దని పేర్ని నాని సూచిస్తున్నారు!
కేసులు నమోదు చేస్తుంటే సిఎం చంద్రబాబు నాయుడు పేరుతో అధికారులను కట్టడి చేసేవిదంగా మాట్లాడుతూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. అధికారంలో లేకపోయినా పేర్ని నాని మంత్రులను, అధికారులను తన జోలికి రాకుండా చేసుకోగలుగుతున్నారు.
ఇలా మైండ్ గేమ్స్ ఆడుతూ గేమ్ చేంజ్ చేసేసి ఈ కేసు నుంచి తప్పించుకొని బయటపడాలని అనుకుంటున్నారు. ఇందుకు ఆయనని నిందించాల్సిన అవసరం లేదు. ఇంత జరిగినా, ఆయన ఇంత మాట్లాడుతున్నా ఆయనని టచ్ చేయలేకపోతే కూటమి ప్రభుత్వమే తనని తాను నిందించుకోవాలి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…