
పండక్కో, పబ్బానికో వేసుకునే మినప గారెలు నిత్య ఆహారంలో భాగమయితే వాటి రుచికూడా తగ్గిపోతుంది, కొన్నాళ్ళకు అవి తినే నోటికి చేదు తనాన్ని తీసుకొస్తాయి అనేది ” తినగా తినగా గారెలు కూడా చేదే” అనే సామెత పరమార్ధం.
అయితే ఇప్పుడు ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజలకు అందిస్తున్న ఉచిత పథకాల అంశం గమనిస్తే ఈ సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది అనిపించక మానదు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఇలా దక్షిణాది రాష్ట్రాలే కాదు యావత్ దేశం మొత్తం ఈ ఉచిత పథకాల చట్రం లో చిక్కుకుపోయాయి.
ఒకరు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే మరొకరు ఉచితంగా స్కూటీలంటున్నారు. ఒకరు అమ్మ ఒడి అంటే మరొకరు తలికి వందనం అంటూ ఇంట్లో ఎంతంది పిల్లలుంటే అంతమందికి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒకరు ఫ్రీ గ్యాస్ అంటే మరొకరు ఉచితంగా తులం బంగారం అంటున్నారు.
ఈ ఉచిత పథకాల పంపకం ద్వారా రాష్ట్రానికి కలిసొచ్చే మేలేమిటో.? పేదల బతుకులలో కనిపించే వెలుగేమిటో ఇప్పటికి ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచానికి చూపించలేకపోయింది. నాడు వైసీపీ నవరత్నాలు అంటే నేడు టీడీపీ సూపర్ సిక్స్ అంటూ ముందుకెళుతోంది.
నాడు బిఆర్ఎస్ దళిత బందు అంటే నేడు కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ అంటూ రాజకీయం చేస్తుంది. ఇలా ఉచితాల రూపంలో రాష్ట్ర ఖజానాను పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకునే రాజకీయం అటు రాష్ట్రానికి ఆర్థిక భారంగా మారితే ఆయా పార్టీలకి చిత్తశుద్ధి లోపాన్ని సూచిస్తుంది.
గెలుపు గుర్రం ఎక్కడం కోసం అన్ని రాజకీయ పార్టీలు బడ్జెట్ కి మించిన ఉచితాలను ప్రజలకు ఎరగా వేసి అధికారాన్ని అందుకున్నప్పటికీ వాటి అమలులో ఏమైనా చిన్న చిన్న ఒడిడుకులు వచ్చినా ఓటర్లు ప్రభుత్వాలను సహించడం లేదు, ఆయా పార్టీలకు తిరిగి అధికారాన్ని అందించడం లేదు.
ప్రభుత్వాలు ప్రజలకు పంచే ఉచిత సొమ్ముని వ్యవస్థల బలోపేతానికి వెచ్చిస్తే ఉదాహరణకు ప్రభుత్వ బడుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల వరకు అన్నింటిని కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి అటు పేదలకే కాకుండా ఇటు మధ్యతరగతి వారికీ కూడా అందుబాటులో ఉంచగలిగితే అది పార్టీలకు ఓటు బ్యాంకు ఆయుధం కాదా.?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబడే ప్రజలు ప్రభుత్వ బడుల వైపు ఎందుకు చూడలేకపోతున్నారు.? అటువంటి వారిని ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి.? వాటి అభివృద్ధి అటు ప్రజలు ఇటు రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజాలను అందిస్తాయి.
అయినా ఆ దిశగా రాజకీయ పార్టీలు ముందడుగు వేయలేకపోయాయి. అలాగే ప్రజలు కూడా అటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను వదిలి తాత్కాలిక ఉచితాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఉచితాలు నానాటికి దాని పరిధిని దాటి విసృతరిస్తున్నాయి.
ఇప్పుడు అధికారానికి అవసరంగా మారిన ఈ ఉచితాలు గారెలు మాదిరి రాజకీయానికి రుచిగా ఉన్నప్పటికీ రేపటి రోజున అవే ఉచితాలు ఆయా పార్టీల అధికారాన్ని దూరం చేసే చేదు వాస్తవాలుగా మిగలక తప్పదు. వైసీపీ ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…