
2019 ఎన్నికల ముందు వంగవీటి రాధ టిడిపిలో చేరారు కానీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అది చాలా మంచి నిర్ణయమని తర్వాత రుజువైంది. ఒకవేళ ఆయన టిడిపి అభ్యర్ధిగా బరిలో దిగి ఉండి ఉంటే వైసీపీ ప్రభంజనంలో మరోసారి ఓడిపోయి ఉండేవారు. కానీ ఈసారి ఎన్నికలలో పోటీ చేయాలని వంగవీటి రాధ నిర్ణయించుకొన్నారు. అయితే ఎక్కడి నుంచి అనే ప్రశ్న వినబడుతోంది.
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కృష్ణా జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి వంగవీటి రాధ కూడా పాల్గొంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం మల్లవల్లిలో భోజన విరామ సమయంలో నారా లోకేష్, వంగవీటి రాధ ఇద్దరు ఏకాంతంగా ఇదే అంశంపై చర్చించుకొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ తన మనసులో మాట నారా లోకేష్ చెప్పగా, చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత నిర్ణయం చెపుతానని హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.
వంగవీటి రాధ విజయవాడలోనే ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకొంటునట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా, తూర్పులో జి.రామ్మోహనరావు, పశ్చిమలో కేశినేని చిన్న ఉన్నారు. కనుక విజయవాడ బయటే పోటీ చేయవలసి ఉంటుంది.
కానీ విజయవాడ చుట్టుపక్కల ఇతర నియోజకవర్గాలలో కూడా టిడిపికి చాలా బలమైన అభ్యర్ధులే ఉన్నారు. వారు ఎన్నికలలో పోటీ చేసేందుకు అప్పుడే సన్నాహాలు చేసుకొంటున్నారు కూడా.
ఒకవేళ జనసేనతో పొత్తులు ఏర్పడితే ఆ పార్టీకి కూడా టిడిపి కొన్ని సీట్లు కేటాయించవలసి ఉంటుంది. వాటితో బిజెపి కూడా వచ్చి కలిస్తే దానికీ కొన్ని సీట్లు కేటాయించవలసి ఉంటుంది. కనుక పొత్తుల విషయం తేలకుండా ఎవరెవరిని ఎక్కడ నుంచి బరిలో దింపాలనేది నిర్ణయించడం కష్టమే.
వంగవీటిని బరిలో దింపే బదులు ఆయనను పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వాడుకొంటే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తద్వారా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్ధుల గెలుపు మరింత సులువు అవుతుందని పార్టీలో సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి అధికారంలోకి వస్తే అప్పుడు వంగవీటి రాధను ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదనేది వారి వాదన. కనుక వంగవీటి రాధ విషయంలో చంద్రబాబు నాయుడు ఏమి నిర్ణయం తీసుకొంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది.
The Paradise was expected to explode at the box office and emerge as a huge…
The teaser of Jo Jo, titled Caution 1, introduces a group of hopefuls drawn to…