
ఒకప్పుడు ఎన్నికలు, పార్టీలు గెలుపోటములు, ప్రభుత్వాలు మారడం అంతా చాలా సజావుగా జరిగిపోయేది. ఎన్నికలలో పార్టీలు ఓడినా, ప్రభుత్వాలు మారినా ప్రజలకు, ప్రతిపక్షాలకు ఎటువంటి కొత్త సమస్యలు ఉండేవి కావు.
ప్రతిపక్ష సభ్యులు ధైర్యంగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలలో తప్పొప్పులను లోతుగా చర్చించేవారు.
రాజకీయాలు… పార్టీలు వాటి సిద్దాంతాలు, విధానాల పరంగా విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతుండేవి. ఎంత బద్ధ శత్రువులైన ఎవరూ వ్యక్తిగత విషయాలు, కుటుంబాలలో మహిళల గురించి ప్రస్తావించేవారు కారు. అంటే అది రాజకీయ స్వర్ణయుగమనే చెప్పుకోవచ్చు.
అలాంటి స్వర్ణయుగం నుంచి ఇప్పుడు పూర్తిగా కలియుగం అంతంలోకి వచ్చేసినట్లే అనిపిస్తోంది నేటి రాజకీయాలు చూస్తుంటే.
ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కూడా గాడి తప్పుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేయకూడని తప్పులు చేసినా ప్రతిపక్షంలో మారగానే మా పాలన ఓ స్వర్ణయుగం అని నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి పాలన చేతకాదని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు శాసనసభ సమావేశాలకు రారు. ముఖ్యమంత్రి పదవి, అధికారం ఉంటేనే ప్రజల మధ్యకు.. లేకుంటే లేదన్నట్లు ఇంటి గడప దాటడం లేదు. ఎందుకని అడిగేవారు లేరు. అడుగుతున్నా పట్టించుకోవడం మానేశారు.
ఇంతటితో సరిపెట్టుకున్నా భరించవచ్చు. కానీ ప్రభుత్వాలు మారగానే కేసులు, కక్ష సాధింపులు, అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఇప్పుడు రాజకీయాలలో పరిపాటిగా మారిపోయింది.
ఈ కారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు తాము అధికారంలోకి వస్తే ఇంతకు ఇంతా తప్పదంటూ ముందుగానే చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలను రద్దు చేస్తామని బహిరంగంగానే చెపుతున్నారు.
గతంలో ఏపీలో, ప్రస్తుతం తెలంగాణలో భవిష్యత్‌లో రెండు రాష్ట్రాలలో అన్నీ ఇలాగే జరుగబోతున్నాయి. అంటే ప్రభుత్వాలు మారిన ప్రతీసారి అభివృద్ధికి బ్రేకులు పడుతూనే ఉంటాయన్న మాట!
అలాగే ఈ మార్పులు, కక్ష సాధింపుల కోసం ప్రతీసారి వందలు, వేలకోట్ల ప్రజాధనం వృధా అవుతూనే ఉంటుందన్న మాట! రాన్రాను ఈ రాజకీయ కక్షలు, వేధింపులు పెరిగిపోయి హత్యా రాజకీయాలకు దారి తీసే ప్రమాదం కూడా కనిపిస్తోంది.
వీటన్నిటికీ రాజకీయ నాయకులు ఎలాగూ మూల్యం చెల్లిస్తారు. అందుకు వారు బాధపడటం మానేశారు కూడా. ఎందుకంటే ఈ రాజకీయాల నుంచే వారు వందలు, వేల కోట్లు సంపాదించుకుంటున్నారు కనుక!
కానీ వారి తప్పిదాలకు రాష్ట్రాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయి. ప్రజలు పార్టీలు వారీగా చీలిపోతున్నారు. తద్వారా సమాజంలో అవాంచనీయ వాతావరణం నెలకొంది. వారి రాజకీయాల కోసం, వారి కక్షల కోసం సామాన్య ప్రజలు కర్రలు, కత్తులు పట్టుకొని కొట్టుకొనే పరిస్థితి వచ్చేసింది. తమకు సంబంధం లేని వాటి కోసం సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
రాజకీయాలలో ఈ అవాంచనీయ ధోరణి క్రమక్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గదని స్పష్టమవుతోంది. కనుక ముందున్న ముసళ్ళ పండగకు సామాన్య ప్రజలు కూడా సిద్ధం కావాల్సిందే!
There were decent expectations for Epic. At the very least, audiences expected a passable one-time…
Haiwaan arrived in theatres after a long wait. Expectations were sky-high for a lot of…