గతంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనేక పార్టీలు మారారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం గంటా మంత్రి పదవి దక్కించుకోవడం ఇప్పటిదాకా సహజంగా జరగడంతో ఎన్నికలు అయిన నాటినుండీ గంటా మీద అనుమానాలు ఉన్నాయి. ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ నామమాత్రంగా 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
పీఏసి చైర్మన్ పదవి ఇవ్వనందున గంటా శ్రీనివాసరావు పార్టీలో చీలిక తెచ్చి బీజేపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగింది.ఆ తరువాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మొన్న తాడేపల్లి గూడెంలో చిరంజీవి ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణకు ఆయన హాజరు అయ్యారు.
అయితే ఆయన ఎన్నికల తరువాత పార్టీ ఆఫీసుకు కూడా రావడం లేదు. దీనితో ఆయన పార్టీలో ఉండటంపై అనుమానాలు ఉన్నాయి. అయితే వాటి అన్నిటికీ గంటా క్లారిటీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. రేపటి నుంచి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఉండి పార్టీ పరిస్థితి పై సమీక్ష చేస్తారు.
ఈ సమీక్ష సమావేశాలకు గంటా రారేమోనని కొంత ప్రచారం జరిగింది. అయితే ఈరోజు ఉదయం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి గంటా హాజరయ్యారు.రేపు చంద్రబాబు సమీక్షకు ఆయన హాజరు అవుతారు. దీంతో గంటా ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగవచ్చని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.





