
ఓ సినిమాలో “పసివాడో ఏమో ఆ పైవాడు… తను చేసిన బొమ్మలతో కలబడతాడు…” అంటూ కవి దేవుడిని సున్నితంగా విమర్శించారు. అలాగే సిరివెన్నెల ‘ఆదిభిక్షువు వాడు’ అంటూ ఆ దేవుడికి ఎవరికీ ఏది ఈయాలో తెలీదు’ అంటూ చిరాకు పడ్డారు.
ఇంకా చాలామంది ఇలాగే భక్తులు, కవులు దేవుడిని ఉద్దేశ్యించి సన్నాయినొక్కులు నొక్కుతూనే ఉన్నారు. కనుక పనిలో పనిగా మనం కూడా ‘దేవుడి స్క్రిప్ట్’ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోక తప్పదు.
ముఖ్యంగా కేసీఆర్, జగన్ విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ వేరేగానే ఉంటోంది. అప్పటికీ కేసీఆర్ యజ్ఞాలు చేశారు. అశ్వమేధయాగంలో గుర్రాన్ని వదిలినట్లు 600 కార్లు వేసుకొని మహారాష్ట్రపై దండయాత్రకి వెళ్ళారు. ఎంతైనా కాబోయే ప్రధాని కనుక ఎందుకైనా మంచిదని తన స్థాయికి తగ్గట్లు వెయ్యి కోట్లు పెట్టి వాస్తు దోషాలు లేకుండా వైట్‌హౌస్‌ని తలదన్నే సచివాలయం కట్టించుకున్నారు.
అంతేకాదు… తెలంగాణ గాంధీకి మించిన స్థాయి తనది అని గట్టిగా నమ్ముతూ దైవత్వం ఆపాదించుకుంటూ యాదాద్రి ఆలయంలో తన బొమ్మ కూడా చేక్కించుకున్నారు.
కానీ ముందే చెప్పుకున్నాము కదా… పసివాడో ఏమో ఆ దేవుడు కేసీఆర్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటే ఫామ్‌హౌసుకి పంపించేశాడు. ఈ దేవుడి స్క్రిప్ట్ ఇలా ఎందుకు ఉందని కేసీఆర్ నేటికీ ఫామ్‌హౌసులో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
ఈ లోకంలో కేసీఆర్‌కి సాటి రాగల మహాభక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ముఖ్యమంత్రిగా ఆయన తిరుమల శ్రీవారికి పెట్టిన నైవేద్యాలు, కప్పిన శాలువాలు, పరకామణిలో కరెన్సీ కట్టలు అన్నీ ఇన్నీ కావు. బెజవాడ కనకదుర్గమ్మ, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, నెల్లిమర్ల శ్రీరామచంద్రుడి విగ్రహం వరకు ఆయన కొలవని దేవుడు లేడంటే అతిశయోక్తి కానే కాదు.
అలనాడు భక్తుడు పిలవగానే పాండురంగడు తరలివచ్చాడు. అలనాడు మొసలి నోటికి చిక్కి గజరాజు పిలిస్తే శ్రీహరి వచ్చేశాడు. జగన్ కూడా అంతకంటే గొప్ప భక్తుడు. కనుకనే ఆయన తలుచుకోగానే సంక్రాంతికి తిరుమల శ్రీవారు ఏకంగా ఆలయంతోనే తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చేశారు.
ఇంత గొప్ప భక్తుడుని కూడా ఆ దేవుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. శత్రువుల మీదకి షర్మిల బాణం సందిస్తే అది ఏడేడు లోకాలు తిరిగి వచ్చి జగన్‌కే గుచ్చుకుంది. ఎప్పటికైనా నారా లోకేష్ వలన తనకు పోటీ, ప్రమాదం తప్పవని కేవలం జగన్ మాత్రమే గ్రహించారు. కనుక పాతాళానికి తొక్కేదామని అవహేళనలు చేయిస్తే, వాటితోనే ఆయన షార్ప్ అయ్యేలా చేశాడీ దేవుడు.
చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో కలవకూడదని కోరుకుంటే జగన్ చేతుల మీదుగానే వారిద్దరినీ కలిపేశాడు. జగన్ స్క్రిప్టులో 175/175 రాసుకుంటే ఆయన 175/11 రాశాడు.
వారిద్దరూ గెలిచినా కొట్టుకొని విడిపోవాలని జగన్ కోరుకుంటే మాది జన్మజన్మల బంధం అన్నట్లు ఫెవికాల్ వేసి అంటించుకున్నట్లు రాసుకుపూసుకు తిరుగుతున్నారు. ఇదేం స్క్రిప్ట్ దేవుడా?
మహా భక్తులమైన మా ఇద్దరికీ ఏమిటీ పరీక్షలు ప్రభూ?మా విషయంలో నీ స్క్రిప్ట్ ఎప్పుడూ ఎందుకూ వేరేగానే ఉంటోంది?నువ్వు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు ప్రభూ?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…