దాదాపు ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలుగా మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నటువంటి మెగాస్టార్ పూర్తి స్థాయి చిత్రానికి (150వ సినిమా) అతి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారని సినీ వర్గాల నుండి లభించిన కీలక సమాచారం. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ జూన్ 6వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుందనే సమాచారం మెగా ఫ్యాన్స్ ను ఆకాశంలో కూర్చోబెడుతోంది.
సెట్స్ పైకి వెళ్ళబోతుండడమే కాదు, ఏకంగా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుని బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితులలో 2017 సంక్రాంతి సమయానికి ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ వర్గాలు గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేసారని తెలుస్తుండగా, సాంకేతిక నిపుణుల ఎంపిక ఇప్పటికే పూర్తయ్యింది.
వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తుండడం విశేషం. మరో హాట్ హాట్ సంగతేంటంటే… ఈ సినిమా విడుదల అవుతున్న సమయంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా విడుదలకు కూడా ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. దీంతో గతాన్ని గుర్తు చేసుకునేలా పోటీ రంజుగా ఉంటుందని అభిమానులు ఇప్పటి నుండే ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఏది ఏమైనా ఈ మెగా వార్త ఫ్యాన్స్ లో నూతన ఉత్తేజాన్ని సృష్టిస్తోంది.



