
బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంత సీనియర్ నాయకులలో ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒకరు. కనుక ఎప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే ఆయనకు కోరిక ఉండటం తప్పు కాదు. కానీ తెలంగాణను తను పోరాడి గెలుచుకున్న సొంత సామ్రాజ్యంగా భావిస్తున్న కేసీఆర్, తన సామ్రాజ్యాన్ని, సైన్యాన్ని (పార్టీని) కొడుకు కేటీఆర్‌కు అప్పగించి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇది హరీష్ రావుకు చాలా నిరాశ కలిగించేదే కానీ కేసీఆర్‌ని కాదని బయటకు వెళ్తే ఏమవుతుందో ఆయనకు తెలుసు. కనుక కేసీఆర్‌కు విధేయంగా మెసులుకుంటున్నారు. గతంలో ఓసారి ఆయన అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినప్పుడు టిఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చేందుకు సిద్దపడ్డారని ఊహాగానాలు వినిపించాయి.
కనుక హరీష్ రావు కేసీఆర్‌కి ఎంత విధేయంగా ఉంటున్నప్పటికీ ,ఏదో రోజు కేసీఆర్‌కి వెన్నుపోటు పొడిచే కట్టప్ప ఆయనే అని తరచూ ప్రత్యర్ధ పార్టీ నేతలు అంటూనే ఉంటారు. అది నిజమేనని.. హరీష్ రావు నిన్న ఆవేశంలో మాట్లాడి బయటపెట్టుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే, మేడిగడ్డ బ్యారేజిలో కొన్ని పిల్లర్లు క్రుంగిపోవడంతో బ్యారేజీలో నీళ్ళు నిలువచేయలేక, ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాలలో పొలాలకు నీళ్ళు అందించలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రాజెక్టులో మిగిలిన నీళ్ళను దిగువకు విడుదల చేయవచ్చని హరీష్ రావు నిన్న శాసనసభలో వాదించారు.
పిల్లర్లు క్రుంగిపోయి, బ్యారేజి కూలిపోయే ప్రమాదం కనిపిస్తుంటే ఏవిదంగా నీళ్ళు విడుదల చేయగలమని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే హరీష్ రావు ముందుకు వచ్చి బాధ్యత తీసుకుని నీళ్ళు విడుదల చేసి చూపాలని, ప్రభుత్వం ఆయనకు పూర్తి సహకారం అందిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
ఆ సవాలుని స్వీకరిస్తూ, “ప్రాజెక్టులో ఓ చిన్న లోపాన్ని పదేపదే ఎత్తి చూపుతూ మాపై బురద జల్లే బదులు, నాకు ఈ సమస్య పరిష్కరించడం చాతకాదని చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ్. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిపుణులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించి నీళ్ళు విడుదల చేస్తాను,” అంటూ హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలనే మనసులో కోరికను అప్రయత్నంగా బయటపెట్టేసుకున్నారు.
హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డికి చాలా ధీటుగానే జవాబు చెప్పారు కానీ పొరపాటున నేను ముఖ్యమంత్రి పదవి చేపడతానంటూ అన్న చిన్న మాట ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఈ మాట విన్న కేసీఆర్ మనసులో హరీష్ రావుపై మళ్ళీ అనుమానం మొదలవకుండా ఉంటుందా?మొదలైతే…. ?
Vijay Deverakonda is confident about his comeback with Ranabaali and has a strong message for…
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…