
తెలంగాణలో హాట్ టాపిక్ హైడ్రా కూల్చివేతలు. వీటిపై ప్రశంశలతో పాటు తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్ళు కోల్పోయిన నిరుపేద, మద్యతరగతి ప్రజలు ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు. హైడ్రాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ‘తగ్గేదేలే’ అంటూ ముందుకే దూసుకుపోతోంది.
శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకి చట్టబద్దత కల్పించి స్వతంత్ర వ్యవస్థగా మార్చారు. వివిద ప్రభుత్వ శాఖల నుంచి దానికి పదోన్నతిపై 169 మంది అధికారులను బదిలీ చేయాలని నిర్ణయించారు. అవుట్ సోర్సింగ్ పద్దతిలో మరో 940 మంది సిబ్బందిని నియమించుకునేందుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లోపల గల మునిసిపల్, గ్రామ పంచాయితీలన్నిటినీ హైడ్రా పరిధిలోకి తెచ్చింది. ఆయా ప్రాంతాలలో చెరువులు, కాలువలు, వాటి బఫర్ జోన్‌లను కాపాడే బాధ్యత హైడ్రాకి అప్పగించింది.
ఇకపై హైడ్రా కూడా ప్రభుత్వ శాఖల మాదిరిగానే పనిచేస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తుంది. ఈ మేరకు నేడో రేపో తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయబోతోంది.
హైడ్రా తదుపరి టార్గెట్స్‌లో మజ్లీస్ అధినేతలు ఓవైసీలకు చెందిన ఫాతిమా కాలేజీ భవనాలున్నాయి. చెరువు భూమిలో 13 ఎకరాలు ఆక్రమించి దానిలో 13 భవనాలు నిర్మించారు. అలాగే ఓ డజనుకి పైగా బిఆర్ఎస్ పార్టీ నేతల ఫామ్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. ఇవికాక నగరంలో పలు ప్రాంతాలలో లగ్జరీ లేక్ వ్యూ విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలున్నాయి.
హైడ్రా పెద్ద పెద్ద భవనాలను కూల్చేందుకు అవసరమైన యంత్రాలు, పరికరాలను ఏర్పాటు చేసుకుంటోంది. కూల్చివేసిన భవనాల శిధిలాలు తొలగించేందుకు టెండర్స్ పిలువబోతోంది.
ఇవన్నీ కలిపి చూస్తే ఇకపై హైడ్రా మరింత దూకుడుగా ముందుకు సాగబోతోందని స్పష్టం అవుతోంది. హైడ్రా కూల్చేసే ప్రతీ భవనంతో చెరువులు, కాలువల పునరుద్దరణ జరుగుతుంది కానీ ప్రతీ కూల్చివేతతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శత్రువులు కూడా పెరుగుతూనే ఉంటారు. కనుక హైడ్రా భవనాలను మాత్రమే కూల్చేస్తుందా లేక చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నే కూల్చేస్తుందా?అనేది మిలియన్ డాలర్ ప్రశ్న!
Jailer 2 is scheduled to arrive in theatres this week. However, the makers have opted…
Janani Ashok Kumar gives classic polka dots a fresh, flirty update in this outdoor photoshoot.…