నిన్న ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్ గా బన్నీవాసు, సుకుమార్ సంయుక్తంగా ఓ సినిమా ప్రారంభించారు. లోకేష్ కనగరాజ్ లాంచ్ చేసిన టైటిల్ విషయంలో మాత్రం చాలా హడావుడి జరుగుతోంది. అదేంటంటే.. అసలు “ఇడుపు కాయితం” అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అని వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
మలయాళ, కన్నడ, తమిళ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ సినిమాలు సైతం సబ్ టైటిల్స్ తో చూసేసి వాటిని తెలుగు మార్కెట్ లో సూపర్ హిట్స్ చేసేస్తున్న మన తెలుగు ప్రేక్షకులు.. ఒక అచ్చ తెలుగు తెలంగాణ టైటిల్ ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో అర్థం కాలేదు. అలాగని అదేమైనా తెలంగాణ మాండలికంలో చాలా భిన్నమైన, ఎప్పుడూ వినని పదమా అంటే అదీ కాదు.
ఇడుపు అంటే విడుపు, కాయితం అంటే కాగితం. అందువల్ల, ఇడుపు కాయితం అంటే విడుపు కాగితం, అనగా.. డైవర్స్ పేపర్స్ అని సింపుల్ మీనింగ్. ఈమాత్రం పదం కూడా అర్థం కాలేదు తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని ఎద్దేవా చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం.
ఆంధ్రా యాసల్ని, మాండలీకాల్ని తెలంగాణ ప్రేక్షకులు ఎప్పుడూ వెటకారం చేయగా చూడలేదు, వినలేదు. నెల్లూరు యాస, గుంటూరు యాస, గోదావరి యాస, రాయలసీమ యాస, విజయనగరం యాస ఇలా పలురకాల యాసల సినిమాల్ని ఆదరించారు తెలంగాణ ప్రేక్షకులు. మొన్నటికి మొన్న బ్లాక్ బస్టర్ హిట్ అయిన “పుష్ప” మొత్తం చిత్తూరు యాసలో ఉంటే ఒక్కరైనా కన్ఫ్యూజ్ అయ్యారా? కంప్లైంట్ చేశారా?
కానీ.. “ఇడుపు కాయితం” అనే స్వచ్ఛమైన పదానికి మాత్రం ఓ ఎగిరెగిరి పడుతున్నారు. భారతీయుల్లో ఎలాగు ఐఖ్యత లేదు, కనీసం పక్క రాష్ట్రాలు, ఒకప్పుడు కలిసున్న రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐఖ్యత కనిపించకపోవడం అనేది సిగ్గుచేటు మాత్రమే కాదు హాస్యాస్పదం కూడా.
చాన్నాళ్ళపాటు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను కామెడీగా లేక విలనిజం కోసం మాత్రమే వాడేవారు. చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయ్యాకే యాసకి కూడా గౌరవం దక్కింది, ఆ యాస నేపథ్యంలో పెద్ద సినిమాలు రావడం, ప్రధాన పాత్రధారులు మాట్లాడడం వంటివన్నీ జరిగాయి.
ఇంత మారినా ఇప్పటికీ తెలంగాణ యాసను యాక్సెప్ట్ చేయడంలో కొంతమంది తెలుగోళ్లు ఎందుకింత ఇబ్బందిపడుతున్నారు? అనేది సమాధానం లేని ప్రశ్న. మరి మన తెలుగోళ్ళు తెలంగాణ యాసను గౌరవించి, యాస, భాష బేధం లేకుండా తెలుగోళ్ళలో ఐఖ్యత కనిపించే రోజులు త్వరగా రావాలని కోరుకుందాం.




