దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రపంచ సినీ ప్రేక్షకులను ‘ఇండిపెండెన్స్ డే’ అనే సినిమా ఒక ఊపు ఊపిన వైనం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ఇండిపెండెన్స్ డే రిసర్జెన్స్’ అనే సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. దాదాపు 200 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
రెండు నిముషాల 50 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం విజువల్ ట్రీట్ గా కొనసాగింది. సినిమాకు ఖర్చు పెట్టిన ప్రతి డాలర్ వెండితెరపై కనపడే విధంగా ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. భూమిని రక్షించడానికి డిఫెన్స్ ఫోర్స్ ఏం చేసిందనేది సినిమా మూలకధ. ‘యుగాంతం’ సినిమా తరహాలో వీక్షకుల ఆసక్తిని రాబట్టేలా ట్రైలర్ యూ ట్యూబ్ లో సందడి చేస్తోంది.
అప్పటి ‘ఇండిపెండెన్స్ డే’ సినిమా ప్రేక్షకుల రివార్డులతో పాటు, విమర్శకుల ప్రశంసలు, అవార్డులు కూడా దాసోహం అన్నాయి. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ ‘రిసర్జెన్స్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అందరి అంచనాలు నిజమయ్యే రోజు జూన్ 24వ తేదీ కానుంది.



