రంగులు తయారీ పరిశ్రమను నడుపుకునే మహేష్ బాబు రంగులను మరింత కలర్ ఫుల్ గా వెండితెరపై అత్యద్భుతంగా చూపించే బాధ్యతను రత్నవేలు తీసుకున్న విషయం తెలిసిందే. ‘1 నేనొక్కడినే’ సినిమా తర్వాత మహేష్ – రత్నవేలు కాంభినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ హైలైట్ అన్న విషయాన్ని ట్రైలర్ మరియు టీజర్స్ ఇప్పటికే స్పష్టం చేసాయి. అయితే ఈ సినిమాకు పనిచేసిన రత్నవేలు అనుభూతులేమిటో తెలుసుకుంటే…
ఉదయ్ పూర్, హరిద్వార్, వారణాసి, ఊటీ వంటి అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపిన “బ్రహ్మోత్సవం” సినిమా వీక్షించడానికి కన్నుల పండుగగా ఉంటుందని చెప్పిన రత్నవేలు… తాను మరో సినిమా కోసం ప్రిపేర్ అవుతుంటే, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ కోసం అడిగితే ఈ సినిమాకు వచ్చేసానని అన్నారు. హై కాంట్రాస్ట్ కలర్స్ వినియోగించే నా సహజ శైలికి విరుద్ధంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు పని చేసానని తెలిపారు.
భారీ తారాగణంతో కూడుకున్న ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని.., వీరందరినీ ఒకే ఫ్రేంలో పెట్టడమే తనకు అతి కష్టంగా మారందని.., ఈ సినిమా ‘ఇంటర్వెల్’ తన ఫేవరేట్ సన్నివేశమని.., ఈ సీన్లో మహేష్ బాబు ప్రదర్శించిన అభినయంకు ప్రేక్షకులు ముగ్దులవుతారని… చెప్పిన సంగతులు ప్రిన్స్ అభిమానుల్లో మరింత ఉత్సుకతను పెంచుతున్నాయి. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.



