యువరాజ్ దెబ్బకు గంభీర్ అవుట్!

IPL 2016 Sunrisers vs Knight Ridersఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’లో భాగంగా మొహలీ వేదికగా జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తా చాటడంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఇంటి ముఖం పట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా జట్టుకు ధావన్ త్వరగా శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్లో బ్యాట్స్ మెన్లంతా మెరుగుగా రాణిస్తుండగా, ధావన్ మాత్రం ఎప్పుడూ తొలి వికెట్ రూపంలో వెనుదిరగడం పరిపాటిగా మారింది. కీలక మ్యాచ్ లో కూడా 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు.

ADVERTISEMENT

ఇక, సీజన్లో అద్భుతమైన ఫాంలో ఉన్న వార్నర్ 28, హేన్రిక్స్ 31 పరుగులు మాత్రమే చేసారు. అయితే యువరాజ్ సింగ్ జట్టు బాధ్యతను తన మీద వేసుకుని స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. కీలకమైన దశలో 30 బంతుల్లో 44 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ కు కారణమయ్యాడు. చివరి ఓవర్లో బిపుల్ శర్మ రెండు సిక్సర్లు బాదడంతో 162 పరుగులు నమోదు చేసింది హైదరాబాద్ జట్టు. కోల్ కతా బ్యాట్స్ మెన్లు భీకర ఫాంలో ఉండడంతో హైదరాబాద్ విజయంపై నీలినీడలు కమ్ముకున్న నేపధ్యంలో బౌలర్లకు తోడు యువరాజ్ చేసిన ఓ రనౌట్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

రెండవ ఓవర్లోనే ఊతప్పను (11) శరణ్ వెనక్కి పంపగా, యువరాజ్ చేసిన అద్భుతమైన రనౌట్ తో వికెట్ల పతనం ప్రారంభమైంది. మున్రో (16)ను రనౌట్ చేసిన తర్వాత వెంటనే గంభీర్ 28 అవుట్ అవ్వగా, ఈ సీజన్లో కోల్ కతా విజయాలకు కారణమైన యూసఫ్ పఠాన్ 2 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్ వైపుకు మ్యాచ్ ను మలుపు తిరిగింది. ఆ తర్వాత మనీష్ పాండే 36 ప్రయత్నించినప్పటికీ, వికెట్లు కోల్పోతూ విజయం ముంగిట బోర్లా పడింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 140 పరుగులు మాత్రమే నమోదు చేసింది.

హైదరాబాద్ జట్టు పతనమవుతున్న దశలో బ్యాటింగ్ లో రాణించి కోల్ కతాకు లక్ష్యాన్ని పెంచిన యువరాజ్, ఇటు మెరుపు ఫీల్డింగ్ తో కోల్ కతా పతనాన్ని శాసించాడు. సన్ రైజర్స్ విజయంలో సమిష్టి కృషి ఉన్నప్పటికీ, యువరాజ్ సింగ్ మాత్రం ప్రధాన పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన హేన్రిక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో శుక్రవారం నాడు హైదరాబాద్ జట్టు గుజరాత్ లయన్స్ తో తలపడనుంది.

ADVERTISEMENT
Latest Stories