మహా ఇరకాటంలో దిల్ రాజు బ్రాండ్

Dil Rajuఎంతటి బాహుబలికైనా చిక్కులు చిరాకులు కష్టాలు తప్పవని రాజమౌళి రెండు భాగాల్లో చూపించాడు. ఆఫ్ట్రాల్ మనుషులం మనమెంత. దానికి పరిశ్రమ జనాలూ అతీతమేమీ కాదు. వందల కోట్ల సినిమాలు తీసినంత మాత్రాన మనం నడిచే దారంతా పూలు ఉండవు. ముళ్ళు గుచ్చుకుంటాయి. రాళ్లు తగులుతాయి. వాటిని తట్టుకుని నిలబడితేనే పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉంటాం. ఇవన్నీ చూశారు కాబట్టి రామానాయుడు లాంటి వాళ్ళు వందల చిత్రాలు తీయగలిగారు. అశ్వినీదత్ లాంటి సీనియర్లు ఇప్పటికీ అయిదు వందల కోట్లతో ప్రాజెక్ట్ కె లాంటివి తెరకెక్కిస్తున్నారు.

సరే ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే ప్రస్తుతం 2020 జెనరేషన్ లో ఓ రేంజ్ లో దూకుడు చూపిస్తున్న ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. మిగిలిన బ్యానర్లకు పార్ట్ నర్లు ఉన్నారేమో కానీ ఈయన ఎస్విసికి మాత్రం సోల్ అండ్ హోల్ మొత్తం రాజుగారే. అలా అని మద్దతు లేదని కాదు. శిరీష్ గట్రా ఉన్నా వాళ్లంతా బ్యాక్ స్క్రీన్ లో ఉండేవాళ్ళే. యాభై సినిమాల మైలురాయికి చేరువలో ఉన్న రాజుగారికి ఏ ముహూర్తంలో కోలీవుడ్ లో అడుగు పెట్టాలనే ఆలోచన వచ్చిందో కానీ విజయ్ లాంటి స్టార్ హీరోతో తీయడమైతే వేగంగా పూర్తి చేశారు కానీ దాని విడుదలకు మాత్రం ఊహించని ఇబ్బందులు పడుతున్నారు.

ADVERTISEMENT

ఇప్పటికే వారసుడుని డబ్బింగ్ కాదని, తీసింది తెలుగు నిర్మాత దర్శకుడు కాబట్టి నా బిజినెస్ నేను చేసుకుంటానని తెగేసి చెప్పి టాలీవుడ్ లో ఒక వర్గానికి బ్యాడ్ అయిపోయిన రాజుగారు అజిత్ కంటే విజయ్ నెంబర్ వన్ అని స్లిప్ అయ్యి అరవంలో ఓ బ్యాచ్ కి అనవసరంగా యాంటీ అయిపోయారు. సాక్ష్యాత్తు సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ తెగింపు డిస్ట్రిబ్యూటర్ కావడంతో అతన్ని మచ్చిక చేసుకుని తగినన్ని థియేటర్లు వరిసుకి రాబట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆల్రెడీ చెన్నై మీడియాలో గుప్పుమంది. తమిళ వెర్షన్ సంగతేమో కానీ వారసుడు తెలుగు డేట్ ఇప్పటిదాకా ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేదు.

ఈ వ్యవహారమంతా సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉన్న దిల్ రాజు బ్రాండ్ ని ఇరకాటంలో పెట్టేదే. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఇక్కడ బ్యాడ్ అయిపోయి. అక్కడా నెత్తినబెట్టుకునే వాళ్ళు లేక మున్ముందు చిక్కులు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. చేతిలో ఆర్సి 15 ఉందని ధీమాగా ఉంటే సరిపోదు. చిరంజీవి బాలకృష్ణలతో సినిమాలు చేయాలని పలు సందర్భాల్లో ఆకాంక్షను వ్యక్తం చేసిన ఈయన వాళ్ళకే థియేటర్లు తక్కువ వచ్చేలా చేస్తే భవిష్యత్తులో ఆ టైఅప్ ఎలా సాధ్యమవుతుంది. అసలు ఓవర్సీస్ కి కంటెంట్ లోడ్ చేయడంలో లేట్ కావడమనేది దిల్ రాజుకి ఎప్పుడూ జరగలేదు. మరి వారసుడికి ఎందుకిలా అయ్యింది. సకల జాగ్రత్తలు తీసుకునే రాజుగారు ఎక్కడ తప్పటడుగు వేశారు. రిలీజ్ డేట్ సరే కనీసం విజయ్ ని తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో చేసే పలుకుబడి కూడా తెచ్చుకోలేకపోయారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

ADVERTISEMENT
Latest Stories