
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. జగన్ ఎన్ని తప్పులు, తప్పటడుగులు వేస్తున్నా తన గురించి, తన పార్టీ గురించి కూటమిలో పార్టీలతో పాటు, మీడియా, ప్రజలు అందరూ చర్చించుకునేలా చేస్తుంటారనేది వాస్తవం.
ఒక్కోసారి సినిమాలను నెగెటివ్ పబ్లిసిటీ కూడా కాపాడినట్లు, తన గురించి జరుగుతున్న ఈ నెగెటివ్ పబ్లిసిటీ లేదా చర్చల వలన కూడా జగన్ ఎల్లప్పుడూ టాప్ లిస్టులో ఉండగలుగుతున్నారు.
ఆర్య సినిమాలో ‘నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో ఫీల్ మై లవ్..’ అనే పాట అక్షరాల జగన్‌కు సరిపోతుందని చెప్పొచ్చు. తన గురించి ఎవరు ఎలా అనుకున్నప్పటికీ అందరూ నిత్యం తన గురించి మాట్లాడేలా చేసుకోవడం కూడా గొప్ప విషయమే కదా?
నిన్న తెనాలి వెళ్ళి రౌడీ షీటర్స్ కుటుంబాలని పరామర్శించడం, నేడు వెన్నుపోటు దినం ప్రకటించడం రెండూ తప్పిదాలే అని వైసీపీ నేతలకు కూడా తెలుసు. కానీ ఈ తప్పులకు కూడా ఎంతగా ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోందో చూసిన తర్వాత తప్పయినా లాభపడ్డాము కదా?అని అనుకోకుండా ఉండరు.
గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 175 సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికిన జగన్‌కి 11 సీట్లు మాత్రమే దక్కాయని, అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటూ కలిసికట్టుగా పోరాడిన కూటమి పార్టీలకు 164 సీట్లు దక్కాయని ఆ రోజు స్పష్టమైంది.
ఎన్నికలలో ఓడిపోతే వైసీపీ పరిస్థితి ఏమిటో ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక వైసీపీకి జూన్ 4 ఓ భయంకరమైన పీడకల వంటిదని చెప్పవచ్చు. ఆ పీడకలని మరిచిపోయి పగటి కలలు కంటున్న వైసీపీ నేతలకు జగన్ మళ్ళీ దానిని గుర్తు చేయడమే కాకుండా ఆ రోజుని ఎన్నడూ మరిచిపోకూడదన్నట్లు దాని కోసం పోస్టర్లు కూడా వేయించుకున్నారు.
జూన్ 4న కూటమి గెలిచింది కానీ అప్పటికి అధికారం చేపట్టలేదు. కానీ నేటితో కూటమి ఏడాది పాలన పూర్తయిందనుకొని, వైసీపీలో అందరూ కలిసి వెన్నుపోటు పొడుచుకుని ఇప్పుడు తాపీగా బాధపడుతున్నారు! ఈ విషయం తమ అధినేతకు చెప్పలేక, ప్రజలకు చెప్పుకోలేక వైసీపీ నేతలు అవస్థ పడుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ, జగన్ వెన్నుపోటుని టీడీపీ చాలా సీరియస్‌గా తీసుకొని ‘జూన్ 4 జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు’ అంటూ ఎదురుదాడి చేస్తోంది.
టీడీపీ వాదనలు సహేతుకంగానే ఉన్నా, తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి కాలు బయటపెట్టని జగన్‌కి తామందరం కలిసి ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నామనే విషయం మరిచిపోయారు.
కనుక ఈ తప్పుడు నిర్ణయంలో ‘అంతిమ లబ్ధిదారు’ జగన్మోహన్ రెడ్డే అని చెప్పక తప్పదు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ నిత్యం ఏవిదంగా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ ఆయనకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారో, టీడీపీ కూడా ఆదేవిదంగా చేయడం అవసరమా?
జగన్ చేస్తున్న ఇటువంటి తప్పుల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలో సీనియర్ నేతలు కాకుండా, పార్టీ కోసం నిలబడుతున్న ద్వితీయ శ్రేణి నాయకుల చేత జగన్ చేసిన తప్పుల గురించి మాట్లాడిస్తే వారూ సంతోషిస్తారు… జగన్‌కి ఫ్రీ పబ్లిసిటీ తగ్గుతుంది కదా?
Paid negativity has become an increasingly familiar phrase whenever a big film enters a crucial…
For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…