
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ దీని వలన తనపై పడిన హిందూ వ్యతిరేకి ముద్రని తొలగించుకునేందుకు ఓ కొత్త వ్యూహం ప్రకటించారు.
ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో పూజలు చేయాలని వైసీపి శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే ఆ రోజున కాలినడకన మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు.
అయితే ఇదంతా తన హయాంలో జరిగిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా కాక ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నందుకు ప్రాయశ్చిత్తంగా చేస్తున్నట్లు ప్రకటించడంతో టిడిపి కూడా ఘాటుగానే స్పందిస్తోంది.
మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ, “మీరు ఈ నెల 28న కాలినడకన తిరుమల వెళతారని తెలిసింది. మీరు ఏవిదంగానైనా వెళ్ళండి. కానీ మీరు అన్య మతస్థులైనందున తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే స్వామివారిపై నాకు నమ్మకం ఉందని తెలియజేస్తూ రిజిస్టర్‌లో సంతకం చేయండి.
మెట్ల మార్గంలో కొండపైకి చేరుకునే మాటయితే కిందనే రిజిస్టర్ ఉంది. దానిలో సంతకం చేయండి. లేదా తిరుమల 17వ కంపార్ట్‌మెంట్‌లో రిజిస్టర్ ఉంది. అక్కడ సంతకం చేసి స్వామివారిని దర్శించుకోండి.
గతంలో అబ్దుల్ కలాం, సోనియా గాంధీ వంటివారు ఈ నిబంధనని గౌరవించి రిజిస్టర్‌లో సంతకాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మీరు వారిద్దరి కంటే గొప్పవారా?
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగూ ఈ నిబందనని పాటించలేదు. కనీసం ఇప్పుడైనా టీటీడీ నిబంధనని గౌరవించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి.
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల పవిత్రత, ప్రతిష్టని దెబ్బ తీసే నిర్ణయాలు చాలానే తీసుకున్నారు. వాటిలో టీటీడీలో రివర్స్ టెండరింగ్ ద్వారా కల్తీ నెయ్యి కొనుగోలు చేయడం కూడా ఒకటి.
తిరుమల శ్రీవారి పట్ల చేయకూడని అపచారాలన్నీ చేసి అవన్నీ బయటపడటంతో మీ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఇప్పుడు ఆలయాలలో పూజలు, తిరుమల దర్శనం అంటూ హడావుడి చేస్తున్నారు. తిరుమల వెంకన్నతో ఆటలాడవద్దని మాకు సుద్దులు చెపుతున్న మీరు చేస్తున్నది ఏమిటి?
ఇది మీకు ‘పొలిటికల్ ఈవెంట్’ కావచ్చు కానీ దాంతో మీరు కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని గ్రహించడం లేదు. కనీసం ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని తిరుమల శ్రీవారి పేరుతో ఈ రాజకీయాలు చేయడం మానుకోండి. లేకుంటే మరింత నష్టపోతారు,” అని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.
జగన్ తిరుమల బయలుదేరితే ఆయన వెనుక వేలాదిమంది వైసీపి నేతలు, కార్యకర్తలు కూడా బయలుదేరడం ఖాయం. అంటే పయ్యావుల చెపుతున్నట్లు జగన్ దీనిని ఓ ‘పొలిటికల్ ఈవెంట్’గా రన్ చేయబోతున్నారని స్పష్టం అవుతోంది.
ఇప్పుడు జగన్ తప్పనిసరిగా రిజిస్టర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది. తిరుమల దర్శనం ప్రకటనతోనే జగన్‌పై క్రైస్తవ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారిపై నాకు నమ్మకం ఉందంటూ జగన్ రిజిస్టర్‌లో సంతకం కూడా చేస్తే వారికి ఆగ్రహం కలుగుతుంది.
అలాగని సంతకం చేయకుండా లోనికి వెళితే స్వామివారిపై భక్తి, నమ్మకం ఉన్నాయని ఒప్పుకోని జగన్ రాజకీయాలు చేయడానికే తిరుమల వచ్చారని టిడిపి విమర్శిస్తుంది. అలాగని ఇప్పుడు తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నా విమర్శలు తప్పవు. కనుక తిరుమల దర్శనంతో జగన్ టిడిపికి చెక్ పెడదామనుకుంటే తన వ్యూహంలో తానే ఇరుక్కుపోతున్నారని చెప్పవచ్చు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…