
జగన్మోహన్ రెడ్డి తాను సింహంలా సింగిల్‌గా తోడేళ్ళ గుంపు వంటి టిడిపి, జనసేన, బీజేపీలతో పోరాడుతున్నానని ఏ ఉద్దేశ్యంతో చెప్పుకున్నప్పటికీ, ఎన్నికల సమయంలో నిజంగానే ఒంటరివారయ్యారు.
కేసీఆర్ అహంభావంతో ఒంటరిగా మిగిలిపోతే, జగన్ అతితెలివి ప్రదర్శించడం వలన ఒంటరిగా మిగిలిపోయారు. ఇదివరకు తన కోసం కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేసిన చెల్లి షర్మిలని శత్రువుగా మార్చుకోవడంతో ఆమె వైసీపి కంచుకోటలో జగన్, అవినాష్ రెడ్డిలకు పక్కలో బల్లెంలా మారారు.
ఎన్నికల సమయంలో తోడుగా ఉంటూ వైసీపి విజయానికి ఎంతో కొంత తోడ్పడగల తల్లి విజయమ్మ అమెరికా వెళ్ళిపోయారు.
జగన్ సతీమణి భారతి తప్ప మరెవరూ ఆయనకు అండగా నిలిచేవారు కనబడటం లేదు. అవినాష్ రెడ్డి ఉన్నప్పటికీ, ఆయనకే జగన్ అండగా నిలబడాల్సి వస్తోంది లేకుంటే కడప కంచుకోటలో వైసీపి ఓటమి ఖాయమే.
విజయసాయి రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, చెవిరెడ్డి వంటివారు తమ నియోజకవర్గాల నుంచి కాలు బయటపెట్టలేకపోతున్నారు. పెడితే ఓటమి తప్పదని భయపడుతున్నారు. ఈ పరిస్థితులలో వైసీపి అభ్యర్ధులు, జగన్ ఎవరికి వారు ఒంటరిగా మిగిలిపోవడంతో ఎవరికి వారు ఒంటరి పోరాటాలు చేయక తప్పడం లేదు.
ఓపక్క జగన్, వైసీపిలు ఒంటరిగా మిగిలిపోతే, మరోపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తరపున యావత్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కదిలివచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండటంతో ప్రజలకు చక్కటి సంకేతాలు వెళ్తున్నాయి.
చంద్రబాబు నాయుడు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో ప్రచారం చేస్తుంటే, కోడలు బ్రాహ్మణి నారా లోకేష్ కోసం మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే నాగబాబు సతీమణి పద్మజ పిఠాపురం వచ్చి బావగారు పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఇంత వరకు సైలంట్‌గా ఉండిపోయిన తెలుగు సినీ ప్రముఖులు కూడా టిడిపి, జనసేన, బీజేపీలకు మద్దతు తెలుపుతున్నారు. అవకాశం ఉన్నవారు వచ్చి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఎటు చూసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లే కనిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరూ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తుండటంతో కూటమి అభ్యర్ధులలో ఉత్సాహం, తప్పక తామే గెలుస్తామనే నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు కూడా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండటంతో కూటమి ప్రచార సభలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హోరెత్తిపోతోంది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఒకవైపు, జగన్, వైసీపి ఒంటరిగా మరోవైపు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. కానీ ఈ ఒంటరితనం, రాజకీయ శతృత్వం, వాటి పర్యవసానాలు అన్ని జగన్ స్వయంగా సృష్టించుకున్నవే కదా?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…