
న్యాయశాస్త్రం చదవాలంటే ఏదైనా లా కాలేజీలో జేరి నాలుగేళ్ళపాటు కష్టపడి చదవాలి. కానీ ఏ లా కాలేజీలో చెప్పని అనేక పాఠాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆయన కేసులలో అనేక ‘లా’జిక్కులు, మ్యాజిక్కులు ఇమిడి ఉన్నాయి.
కనుక లా విద్యార్దులు వాటిని అధ్యయనం చేసి ఆకళింపజేసుకుంటే లా క్షుణ్ణంగా వచ్చేసిన్నట్లే. అక్రమాస్తుల కేసులను, వివేకా హత్య కేసుల విచారణని త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించి గడువు విధించినా, అదే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసులు వేస్తూ దాని చేతే గడువు పొడిగింపజేసుకోవడం జగన్‌కి మాత్రమే సాధ్యం!
వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టడం, నిందితుడిని పక్కన పెట్టుకొని బాధితుల(సునీతా రెడ్డి)ని విమర్శించడం, ఒక కేసులో అనేక సాకులతో పిటిషన్లు వేస్తూ కోర్టులనే గందరగోళపరచడం, కేసు ఒక్క అడుగు ముందుకు సాగకుండా కట్టడి చేయగలగడం వంటి అనేక కొత్త పాఠాలు ఈ కేసులలో ఉన్నాయి.
అందుకే అక్రమాస్తుల కేసులు 10-11 ఏళ్ళబట్టి సాగుతూనే ఉన్నాయి. అలాగే వివేకా హత్య కేసుకి అప్పుడే 5 ఏళ్ళ వయసొచ్చేసింది. ఈ రెండు కేసులు మరో 20 ఏళ్ళు సాగినా ఆశ్చర్యం లేదు. అప్పటికి మరో తరం న్యాయవాదులు కూడా వచ్చేసినా ఆశ్చర్యం లేదు.
కనుక ఓ కేసుని ఏవిదంగా సాగదీయవచ్చో పాఠంగా ఈ రెండు కేసులను న్యాయవిద్యలో ఓ అధ్యాయంగా పెడితే బాగుంటుంది. విషయంలోకి వస్తే, వివేకా హత్య కేసులో ఏ6 నిందితుడుగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డికి గజ్జల ప్రధాన అనుచరుడు. కనుక గజ్జలకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని, అది కేసు విచారణపై ప్రభావం చూపుతుందని సీబీఐ, సునీతా రెడ్డి న్యాయవాదులు వాదించారు. కానీ వారు ఎంతగా వాదించినా హైకోర్టు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కనుక ఈ కేసు విచారణ ఇంకా ఎప్పటికీ ముగుస్తుందో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన చేసుకొని వస్తానని అడగగలుగుతున్నారు.
అంతేకాదు… ఈ కేసు నడుస్తుండగానే మరోసారి అంటే 2029లో ముఖ్యమంత్రిని అవుతానని కూడా జగన్ చెపుతున్నారంటే, లా చదవకపోయినా కేసులని ఎలా మేనేజ్ చేయాలో క్షుణ్ణంగా ఔపోసన పట్టేసిన్నట్లే అనుకోవచ్చు.
Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…