
జగన్-షర్మిల మద్య ఆస్తుల పంపకాలలో గొడవలు జరిగినందునే ఆమె వైసీపిని, ఏపీని విడిచి తెలంగాణకు వెళ్ళిపోయారని వార్తలు వస్తుండేవి. కానీ వాటి గురించి వారిరువురూ బయట మాట్లాడకపోవడంతో వారి కుటుంబ పంచాయితీలపై ఊహాగానాలుగానే చలామణి అవుతుండేవి.
కానీ జగన్ దంపతులు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాల కోసం జరుగుతున్న గొడవలు బహిర్గతం అయ్యి వారి కుటుంబం రోడ్డున పడిందిప్పుడు.
దివంగత రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లో చెల్లి షర్మిల, తల్లి విజయమ్మలకి వాటాలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వైఎస్ షర్మిల తనకి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నందున వారితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ దంపతులు సెప్టెంబర్ 10న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్లో పిటిషన్ వేశారు.
ఈ మేరకు వారిరువురికీ నోటీస్ ద్వారా తెలియజేయడంతో వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. దీంతో వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ సోషల్ మీడియాలోకి కూడా వచ్చేసింది.
వైఎస్ షర్మిల జగనన్నకు వ్రాసిన లేఖలో ముఖ్యాంశాలు:
మన తండ్రిగారి కుటుంబ ఆస్తుల ద్వారా ఏర్పాటుచేసుకున్నవే సరస్వతీ పవర్, భారతీ సిమెంట్స్ వగైరా సంస్థలు. కనుక వాటిలో తన మనుమలందరికీ సమానంగా వాటాలు ఇవ్వాలని మన తండ్రిగారి ఆదేశం మేరకే నాకు, అమ్మ విజయమ్మకి మీరు వాటాలు ఇచ్చేందుకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు తప్ప మాపై ప్రేమాభిమానాలతో కాదని మాకు తెలుసు. ఈ విషయాలన్నీ మన తల్లి విజయమ్మకి తెలుసు. అందువల్లే మీ నిర్ణయం పట్ల అభ్యంతరం తెలుపుతూ నేను వ్రాసిన ఈ లేఖపై ఆమె కూడా సంతకం చేశారు.
ఈ ఆస్తుల పంపకాలకు, నా వ్యక్తిగత రాజకీయాలకు ఎటువంటి సంబందమూ లేదు. అలా ఉంటుందని ఒప్పంద పత్రంలో వ్రాసుకోలేదు. కానీ ఆ వంకతో మాకు న్యాయంగా దక్కాల్సిన వాటాలని ఇవ్వకుండా వాటిని కూడా మీరే సొంతం చేసుకోవాలనే దురుదేశ్యంతోనే ఈ పిటిషన్ వేశారు. మీలో అటువంటి దురుదేశ్యం ఉంది కనుకనే 2019లో ఒప్పందం చేసుకుంటే ఇంతవరకు దాని ప్రకారం నాకు వాటాలు బదిలీ చేయలేదని భావిస్తున్నాను.
కేవలం మీరు నా సొంత అన్న అనే ఏకైక కారణంతో కంపెనీలో సమాన వాటాని వదులుకొని, మీరు ఇచ్చినంతే తీసుకునేందుకు అంగీకరించాను. కానీ అవి కూడా ఇచ్చేందుకు మీకు మనస్కరించడం లేదని ఇప్పుడు స్పష్టమైంది.
వైఎస్ అడుగుజాడలలో నడవాల్సిన మీరు ఆస్తుల కోసం సొంత తల్లి, సొంత చెల్లినే కోర్టుకి ఈడ్చేందుకు సిద్దమవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది… అంటూ వైఎస్ షర్మిల ఇంకా చాలా ఘాటుగానే అన్నకు లేఖ వ్రాశారు. కానీ క్లుప్తంగా ఆమె లేఖ సారాంశం ఇది.
ఇప్పటికే వివేకా హత్య కేసు విషయంలో వైఎస్ షర్మిల చేసిన తీవ్ర ఆరోపణలతో జగన్ పట్ల ప్రజలలో దురాభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు ఆస్తుల పంపకాల విషయంలో జగన్ ఈవిదంగా వ్యవహరించడం, దానిపై వైఎస్ షర్మిల ఈవిదంగా అన్నని విమర్శిస్తూ బహిరంగ లేఖ వ్రాయడం వలన జగన్, ఆయన వలన వైసీపి పట్ల ప్రజలలో ఏర్పడిన దురాభిప్రాయం మరింత బలపడుతుందని వేరే చెప్పక్కరలేదు.
తల్లికి, చెల్లికి ఆస్తులలో వాటాలు నిరాకరిస్తే వారు ఇలానే రియాక్ట్ అవుతారని జగన్‌కి తెలియదనుకోలేము. అయినా తల్లికి, చెల్లికి ఆస్తులు పంచి ఇవ్వడం కంటే తన పరువు పోయినా, రాజకీయంగా పార్టీకి నష్టం జరిగిన పర్వాలేదని జగన్ అనుకోవడమే ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.
The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…