
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ యువ నేత నారా లోకేష్ తన పార్టీలోని వైసీపీ బాధితులకు రక్షణ కల్పించేందుకు గాను ‘రెడ్ బుక్’ ను రూపకల్పన చేసారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెడ్ బుక్ బాధితులందరికీ చట్ట పరంగా న్యాయం చేస్తానంటూ నాడు లోకేష్ పార్టీ క్యాడర్ కి హామీ ఇచ్చారు, వారిలో మానసిక ధైర్యాన్ని నింపారు.
అయితే నాడు లోకేష్ తన పార్టీ క్యాడర్ లో మనోధైర్యాన్ని నింపడానికి సృష్టించిన ఈ రెడ్ బుక్ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలంగా మారింది, అలాగే అనేక రాజకీయ పార్టీల నేతల నుంచి అధినేతల వరకు వారికి ఇదే రెడ్ బుక్ స్ఫూర్తిగా నిలిచింది.
అందులో భాగంగానే వైసీపీ అధినేత వైస్ జగన్ సైతం లోకేష్ రెడ్ బుక్ ని ఆదర్శంగా తీసుకుని వైసీపీ క్యాడర్ కోసం ‘డిజిటల్ బుక్’ ని లాంచ్ చేసారు. అయితే టీడీపీ, లేదా కూటమి ప్రభుత్వ బాధితులందరూ ఈ డిజిటల్ బుక్ లో తమ సమస్యను నమోదు చేస్తే తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఆ సమస్యకు తగిన పరిష్కారం చూపుతాం అంటూ జగన్ సైతం తన పార్టీ క్యాడర్ కు భరోసా ఇచ్చారు.
అయితే ఇక్కడ డిజిటల్ బుక్ లో నమోదవుతున్న ఫిర్యాదులను పరిశీలిస్తే ఈ డిజిటల్ బుక్ కూటమి బాధితుల కోసం అనుకుంటే ఇక్కడ కూడా వైసీపీ బాధితులే ప్రత్యక్షమవుతున్నారు. ఇందులో నమోదైన మొదటి ఫిర్యాదు మాజీ మంత్రి విడుదల రజని మీద కాగా ఇప్పుడు నమోదవుతున్న ఫిర్యాదులు సైతం వైసీపీ నాయకుల పేర్లనే బయటకు తెస్తున్నాయి.
మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పే స్వామి తమ వద్ద నుంచి 25 లక్షలు వసూలు చేసారంటూ డిజిటల్ బుక్ లో తమ ఫిర్యాదును నమోదు చేసారు కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రమ్.
అలాగే డొక్కలపల్లి గ్రామానికి చెందిన తనకు అంగన్ వాడి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 75 వేలు తీసుకున్నట్టు రామరాజు జగన్ డిజిటల్ బుక్ లో మరో ఫిర్యాదు నమోదు చేసారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టుగా జగన్ ఒకటి భావిస్తే ఇక్కడ మరొకటి జరుగుతుంది.
ఇలాగే జగన్ రానున్న రోజులలో కూడా ఈ డిజిటల్ బుక్ మీద ప్రజలలో పూర్తి స్థాయి అవగాహన తీసుకువస్తే 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన వై నాట్ 175 నినాదం ఎందుకు వై నాట్ 11 గా మారిందో ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గ్రహించగలరు.
అయితే ఏదేమైనా మొత్తానికి జగన్ తన పార్టీ నేతల అవినీతి చిట్టా, అరాచకాల పద్దులను ఈ రూపంలో అయినా తెలుసుకుంటున్నందుకు హర్షించాల్సిందే. అలాకాకుండా ఇప్పటికి సత్యాన్ని గ్రహించలేక వాస్తవాన్ని జీర్ణించుకోలేక తానూ సృష్టించిన డిజిటల్ బుక్ లో సైతం వైసీపీ కి వ్యతిరేకంగా ఫిర్యాదులు రావడంతో జగన్ దీన్ని కూడా ఎల్లో మీడియా జాబితాలో వేసేస్తారా.?
లేదంటే వైసీపీ ఓటమికి ఈవీఎం ల ట్యాపరింగ్ కారణమని, లేదా ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు వైసీపీ ని వెనక్కి నెట్టాయంటు భ్రమపడుతూ, ఇప్పటికి వైసీపీ క్యాడర్ ను కూడా మభ్య పెడుతూనే ఉంటారు.
Over the last few years, South films, starting from Baahubali in 2015, have undoubtedly created…
An IndiGo flight travelling from Navi Mumbai to Mangalore was delayed by more than an…