Telugu

జగన్‌ కూడా నీళ్ళలోకి దిగుతున్నారా?

బీఆర్ఎస్‌ పార్టీ నీళ్ళ పేరుతో ఆంధ్రా ప్రభుత్వాన్ని, పాలకులను నిందిస్తుంటే, తమ నీళ్ళు ఎత్తుకుపోతున్నారని పదేపదే ఆరోపిస్తుంటే, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఎందుకు స్పందించడం లేదు?

కనీసం సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎందుకు వారి ఆరోపణలను ఖండించడం లేదు?

ADVERTISEMENT

కనీసం పార్టీల పరంగా కూడా వారికి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? అని ఆంధ్రా ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా సందేహాలున్నాయి.

బీఆర్ఎస్‌ పార్టీ ఇటువంటి అంశాలతో తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి, రాజకీయంగా మైలేజ్ లేదా లబ్ధి పొందాలని ఆశిస్తుందనేది బహిరంగ రహస్యం. కనుక దానికి ఆ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ మౌనం వహిస్తోందని భావించవచ్చు.

ఇక జగన్‌-కేసీఆర్‌, కేటీఆర్‌ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అవి చెడిపోవాలని జగన్‌ కోరుకోరు. కనుక ఈ విషయంలో వైసీపీ కూడా మౌనం వహిస్తుంది.

ఇవేకాక, బయటకు చెప్పుకోలేని కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవేమిటో రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.

అయితే ఇంతకాలం ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిలను ముడిపెట్టి నిందిస్తున్న హరీష్‌ రావు, నిన్న హఠాత్తుగా జగన్‌ మీదకు బాణాలు సంధించారు!

నాడు కేసీఆర్‌ రాయలసీమ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర మంత్రి ఎదుటే జగన్‌ను గట్టిగా హెచ్చరించారని హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని బదులివ్వడమే అనూహ్యమనుకుంటే, జగన్‌ కూడా కొద్దిసేపటి క్రితమే బదులివ్వడం మరింత అనూహ్యం.

“మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్ళు, అవే కేటాయింపులు..” అంటూ రాయలసీమ ప్రాజెక్టు, నీళ్ళ వినియోగం గురించి ‘ఎక్స్‌’లో చాలా పెద్ద పోస్ట్ పెట్టారు.

అయితే అక్కడ బీఆర్ఎస్‌ పార్టీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను ముడిపెట్టి విమర్శిస్తుంటే, ఇప్పుడు జగన్‌ కూడా ‘కాంగ్రెస్‌తో హాట్‌లైన్ దోస్తీ కోసం’ మౌనంగా ఉండిపోతున్నారంటూ ఇద్దరినీ ముడిపెట్టి సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించారు.

అంటే ఇంతకాలం బీఆర్ఎస్‌ ఒక్కటే నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు వైసీపీ కూడా దాంతో చేతులు కలిపినట్లు సందేహం కలుగుతోంది. ఇందుకు బలమైన కారణమే కనిపిస్తోంది.

ఏ కోణంలో చూసినా రెండు రాష్ట్రాల్లోని రెండు పార్టీల పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంది. కనుక ఇప్పుడు వైసీపీ కూడా నీళ్ళ పేరుతో మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్ఎస్‌ నేతలపై కత్తులు దూస్తూ, ఏపీలో ‘ఆంధ్రా సెంటిమెంట్’ సృష్టించి, వారి బారి నుంచి ఏపీని వైసీపీ మాత్రమే కాపాడగలదనే కొత్త వాదనలు వినిపిస్తుందేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

అంజలి పెళ్ళికి జగన్ గిఫ్ట్ ‘కోర్టు’ నోటీసులా?

కూతురి పెళ్లి ప్రతి తల్లికి జీవితంలో మధురమైన జ్ఞాపకం. ఆ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాలని, కుటుంబమంతా ఒక్కచోట చేరి…

11 minutes ago

2027…’పాదయాత్రల నామసంవత్సరం’ కానుందా?

2027లో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు 'పాదయాత్రల' చుట్టూ తిరగనున్నాయా? అధికార పీఠమే లక్ష్యంగా పలువురు రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలోకి…

18 minutes ago