
Jagan Sharmila Property Dispute Before Anjali Wedding
కూతురి పెళ్లి ప్రతి తల్లికి జీవితంలో మధురమైన జ్ఞాపకం. ఆ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాలని, కుటుంబమంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడపాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ వైఎస్ షర్మిల విషయంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.
సంతోషాల మధ్య జరగాల్సిన కూతురు అంజలి వివాహ వేడుక అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. మేనకోడలి పెళ్లి అంటే మేనమామగా దగ్గరుండి బాధ్యతలు పంచుకోవాల్సిన జగన్.. ఇప్పుడు ఆ పెళ్లి వేదిక విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
యలహంక ప్యాలెస్‌లో వివాహం నిర్వహించాలన్న షర్మిల ఆలోచనకు జగన్ అభ్యంతరం చెప్పడంతో మొదలైన వివాదం చివరకు న్యాయస్థానం వరకు చేరింది. భద్రత, గోప్యత కారణాలతో జగన్, షర్మిలకు లేఖ రాయడం, ఆమెకు యలహంక ప్యాలస్ లోకి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టడం వివాదం మరింత జటిలంగా మారింది.
అయితే షర్మిల మాత్రం యలహంక తన వాటాలో ఆస్తి అంటూ ఒకరి ఎంగిలి మెతుకులకు ఆశపడే మనస్తత్వం తనదికాదంటూ అన్న జగన్ లేఖకు ఘాటుగా బదులు చెప్పారు. అలాగే జగన్ లేనవెత్తినా అభ్యంతరాలతో వివాహ వేదికను యలహంక నుంచి మార్చినప్పటికీ ఆ ఆస్తి విషయంలో విభేదాలు ఆగలేదు.
నవంబర్ 21న బెంగళూరులోని దేవనహళ్లి కోర్టు సిలికాన్ బిల్డర్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు ఆస్తిలోకి ప్రవేశించకుండా కోర్టు నోటీసులిచ్చింది. ఈ పరిణామాల మధ్య తల్లి విజయమ్మతో కలిసి యలహంకకు వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకోవడం మరోసారి చర్చకు దారితీసింది.
ఒకప్పుడు ఇదే కుటుంబం రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కలిసిమెలిసి కనిపించేది. ఇప్పుడు మాత్రం ఒకరి ఇంటికి మరొకరు వెళ్లలేని పరిస్థితి రావడం కుటుంబ బంధాల్లో ఏర్పడిన దూరాన్ని బయటపెడుతోంది. నిజానికి ఈ వివాదంలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అన్నది న్యాయస్థానాలు తేల్చాల్సిన అంశం.
ఆస్తి హక్కులపై ఎవరి వాదనలు వారికి ఉండవచ్చు. రాజకీయంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవచ్చు. కానీ వాటి ప్రభావం కుటుంబంలోని శుభకార్యాలపై పడటం మాత్రం అత్యంత బాధాకరమైన అంశమనే చెప్పాలి. తండ్రి వైఎస్సార్ లేని సమయంలో అన్నగా జగన్ అండగా నిలవాల్సిన సందర్భంలో ఇలాంటి వివాదాలు తెరపైకి రావడం మరో కోణంలో చర్చకు దారితీస్తోంది.
చివరకు అంజలి పెళ్లికి మేనమామగా జగన్ నుంచి వచ్చిన గిఫ్ట్ ‘కోర్టు’ నోటీసులా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే జగన్ ను నైతికంగా ప్రశ్నిస్తుంది. ఆస్తులు, రాజకీయాలు ఎప్పటికైనా మారవచ్చు. కానీ కుటుంబ బంధాల్లో ఏర్పడిన గాయాలు అంత సులభంగా మానవు. మరి అంజలి వివాహానికి చెల్లి షర్మిలకు జగన్ ఇచ్చిన గిఫ్ట్ కి భవిష్యత్ లో షర్మిల నుంచి కూడా జగన్ కి ‘రిటర్న్ గిఫ్ట్’ ఉంటుందా?
బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ పేరుతో ఆంధ్రా ప్రభుత్వాన్ని, పాలకులను నిందిస్తుంటే, తమ నీళ్ళు ఎత్తుకుపోతున్నారని పదేపదే ఆరోపిస్తుంటే, సీఎం చంద్రబాబు…
2027లో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు 'పాదయాత్రల' చుట్టూ తిరగనున్నాయా? అధికార పీఠమే లక్ష్యంగా పలువురు రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలోకి…