
విజయవాడ వరదలు, ప్రకాశం బ్యారేజీ-మూడు పడవలు, తిరుమల కల్తీ నెయ్యి, సనాతన ధర్మ పరిరక్షణ వగైరా ఎపిసోడ్స్ అత్యంత జనాధరణతో అటకెక్కాయి.
తాజాగా జగన్-షర్మిల ఆస్తుల కీచులాటల ఎపిసోడ్ కూడా అంతే రసవత్తరంగా సాగుతోంది. బహుశః మరో కొత్త ఎపిసోడ్ మొదలయ్యే వరకు ఇది సాగవచ్చు.
ఈ ఎపిసోడ్‌లో జగన్ విలన్‌గా ఉండటంతో తల్లి, చెల్లి సెంటిమెంట్ బాగా పండుతోంది. కానీ వారిరువురికి ప్రజల సానుభూతి లభిస్తోంది తప్ప ఎవరూ వచ్చి మద్దతుగా మాట్లాడటం లేదు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. కానీ కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆమెకి మద్దతు తెలుపడం లేదు! ఈ లెక్కన ఏపీ కాంగ్రెస్ ఎప్పుడు బాగుపడుతుంది? అనేది ధర్మసందేహం.
ఈ ఎపిసోడ్‌లో విలన్ పాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనక మాత్రం యావత్ వైసీపి నేతలు, వారి సొంత మీడియా, సోషల్ మీడియా కురుసైన్యంలా వచ్చి పోరాడుతున్నాయి.
ఏపీలో అన్నా,చెల్లి అంటే వీళ్ళిద్దరే కావచ్చు. కానీ తెలంగాణలో ఈ కాంబినేషన్‌లో కేటీఆర్, కల్వకుంట్ల కవిత మాత్రమే ఎవరికైనా టక్కున గుర్తోస్తారు.
కల్వకుంట్ల కవిత తిహార్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చినప్పుడు ఆమె భర్త కంటే ముందుగా ఆమెను ఆత్మీయంగా పలకరించింది కేటీఆరే. కేటీఆర్‌తో పాటు బావ హరీష్ రావు, ఇంకా పలువురు బిఆర్ఎస్ నేతలు ఆమెను తోడ్కొని హైదరాబాద్ తీసుకువచ్చి కేసీఆర్‌కి అప్పగించారు.
కానీ తన విషయంలో మాత్రం ‘రివర్స్ టెండరింగ్’ జరుగుతోందని జగన్ ఆరోపిస్తున్నారు. కేటీఆర్ చెల్లిని జైలు నుంచి విడిపించుకొని ఇంటికి తెచ్చుకుంటే, షర్మిల తనని జైలుకి సాగనంపడానికి కుట్రలు పన్నుతున్నారని జగన్ ఆరోపిస్తున్నారు.
మరో విషయం ఏమిటంటే అక్కడ తెలంగాణలో కేటీఆర్, ఇక్కడ ఏపీలో జగన్ జైలుకి వెళ్ళడం గురించి మాట్లాడుతుంటే నిప్పు లేనిదే పొగ రాదంటే ఇదేనేమో?అనిపిస్తుంది. కానీ జగన్ సొంత చెల్లికే హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఆయనకు ఆమె ముహూర్తం పెడితే తప్పేముంది? అనిపిస్తుంది.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె అన్నని ఏవిదంగా జైలుకి పంపగలరు?అంటే ‘సాధ్యమే’ అని వైసీపి నేతలు చెపుతున్నారు.
“ఆమె వెనుక సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన చేతిలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నాయి కదా?” అని మంచి లాపాయింట్ తీసి చెపుతున్నారు. నిజమే స్మీ! బహుశః అందుకే జగన్ ఇంతగా ఆందోళన చెందుతున్నారేమో? అనిపిస్తుంది.
చివరిగా ఓ ముక్క చెప్పుకోవాలి. ఆమె చంద్రబాబు నాయుడు చేతిలో బాణంగా మారిందని వాదిస్తున్నారు. కాదు ఆయన చేతిలో పావుగా మారిందని కూడా వారే వాదిస్తున్నారు. బాణానికి, పావుకి చాలా తేడా ఉంది. బాణం అయితే గుండెల్లో దిగబడి ప్రాణం తీస్తుంది. పావు అయితే ‘చెక్ మేట్’ చెప్పే ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక ఏదైనా అపాయమే.
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…
Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…