
ఏపీ మద్యం కుంభకోణం కేసులో అందరినీ ప్రశ్నించారు. కొంతమందిని లోపలేశారు. ఇంకేముంది.. తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నోటీస్ పంపించి లోపలేసేస్తారనుకున్నారు.
అలా అనుకున్నవారిలో జగన్ కూడా ఉన్నారు. “ఈ అక్రమ కేసులో నన్ను ఇరికించి జైల్లో పెట్టాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇక్కడే ఉన్నాను. అరెస్ట్ చేసుకోవచ్చు,” అని జగన్ చెప్పేశారు.
కనుక ఈ కేసు కొలిక్కి వచ్చేసిందని నేడో రేపో జగన్‌ని అరెస్ట్ చేసి లోపల వేయడం ఖాయమనే చాలా మంది భావించారు. కానీ నేటికీ ఆ కేసు విచారణ జీడిపాకంలా సాగుతూనే ఉంది… జగన్ శవరాజకీయాలు, తోతాపురి రాజకీయాలు చేస్తూ ‘రప్పా రప్పా..’ అంటూ ప్రభుత్వాన్ని బెదిరిస్తూనే ఉన్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఇన్ని సాక్ష్యాధారాలు చేతిలో ఉన్నప్పటికీ, జగన్ ఇంతగా రెచ్చిపోతుంటే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఎందుకు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు?
జగన్ తన గొయ్యి తానే తవ్వుకునే వరకు సిఎం చంద్రబాబు నాయుడు సంయమనం పాటిస్తున్నారా?లేదా జగన్ చేస్తున్న ఈ కొత్త రకం రాజకీయాలను ఏవిదంగా హ్యాండిల్ చేయాలా? అని ఆలోచిస్తున్నారా?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ & కోపై కూడా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా 1 రేసింగ్ కేసులున్నాయి. ప్రభుత్వం వద్ద ఆ కేసులకు సంబందించి అనేక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. రేసింగ్ కేసులో కేటీఆర్‌ని అరెస్ట్ చేయబోతున్నామంటూ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఎప్పుడో చెప్పగా, తనని అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ కూడా ఎప్పుడో చెప్పారు.
కానీ అక్కడ తెలంగాణలో, ఇక్కడ ఏపీలో ఏ కేసులో ఎవరినీ ప్రభుత్వాలు అరెస్ట్ చేయలేదు!చేస్తే ఆ పార్టీలు హడావుడి చేసి సానుభూతి సంపాదించుకుంటాయని తొందరపడటం లేదనిపిస్తుంది.
జగన్ ఆవిదంగా తొందరపాటుతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి టీడీపీని తుడిచిపెట్టేయాలనుకుంటే, ఆ సానుభూతిలో వైసీపీఏ తుడిచిపెట్టుకుపోయింది. కనుక ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అరెస్టులకు తొందరపడటం లేదనిపిస్తుంది.
కానీ అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఇటువంటి రాజకీయాలను కవచంగా వాడుకుని తప్పించుకుంటుంటే, సానుభూతి రాజకీయాలతో వారికి లబ్ధి పొందుతారనే ఆలోచనతో ప్రభుత్వాలు వారిని శిక్షించలేకపోతే ప్రజలేమనకోవాలి?
ఈ చట్టాలు, శిక్షలకు రాజకీయ నాయకులు అతీతులు.. అవి కేవలం తమ వంటి సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవాలా?
చివరిగా మద్యం కుంభకోణం కేసు విచారణ గురించి ఓ మాట చెప్పుకోవాలి. ఈ కేసులో ఎ-5గా ఉన్న విజయసాయి రెడ్డికి నోటీసులు పంపి ఈ నెల 12న మళ్ళీ విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది.
ఈ కేసు విచారణతో సిట్ ఇంతవరకు ఏం పురోగతి సాధించిందో తెలీదు కానీ విచారణకు పిలిచినప్పుడల్లా ఈ కేసులో విజయసాయి రెడ్డి మీడియాకి కొత్త కొత్త విషయాలు చెపుతుండటమే కనిపిస్తోంది. కనుక ఆయన చేత ఏదో మాట్లాడించడానికే విచారణకు పిలిపిస్తున్నారా?అనే సందేహం కలుగుతుంది.
కనుక ఈసారి సిట్ విచారణ ఏవిదంగా సాగుతుందో అని కాకుండా ఈసారి ఆయన కొత్త విషయాలు ఏం చెప్తారో? అని ఎదురు చూడాలేమో?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…