
ఏపీ మద్యం కుంభకోణం కేసు.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు అంత బలమైనది. ఈ రెండు కేసులలో ప్రధాన సూత్రధారులపై చర్యలు చేపట్టేందుకు సిట్ అధికారుల వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయి.
కానీ ఈ రెండు కేసుల విచారణ మూడడుగులు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. తెలంగాణ బీజేపి ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ “ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందా లేక డైలీ సీరియల్ నడుస్తోందా?” అని ప్రశ్నించడం గమనిస్తే పరిస్థితి అర్దమవుతుంది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో జైలుకి వెళ్ళడానికి జగన్ కూడా మానసికంగా సిద్దపడ్డారంటే ఈ కేసులో సాక్ష్యాధారాలు ఎంత బలంగా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు.
కానీ ఇంత బలమైన కేసు విచారణ కూడా నత్త నడకలు నడుస్తుంటే, మద్యలో చాలా బలహీనమైన పల్నాడు కేసు హైలైట్ అయ్యింది.
ఆ కేసు విచారణ కూడా రెండు వారాలకు వాయిదా పడింది. అంతవరకు జగన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
అయినా తలుపులు నమిలేసే వాడికి అప్పడాలు ఓ లెక్కా? అన్నట్లు అక్రమాస్థుల కేసులోనే బెయిల్ సంపాదించుకొని ముఖ్యమంత్రి కూడా కాగలిగిన జగన్మోహన్ రెడ్డికి, ఈ కారు ప్రమాదం కేసు ఓ పెద్ద లెక్కా?అంటే కాదనే చెప్పవచ్చు. ఎలాగూ రెండు వారాలు బ్రేక్ దొరికింది కనుక జగన్ మళ్ళీ నెల్లూరు పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నారు.
ఈరోజు తాడేపల్లి ప్యాలస్‌లో ‘వైసీపీ యువత’కి జగన్ దిశా నిర్దేశం చేశారు. కనుక ఈసారి నెల్లూరు బలప్రదర్శన మరికాస్త గట్టిగానే ఉండవచ్చు. కనుక బంతి కూటమి ప్రభుత్వం, పోలీసుల కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు.
ఓ పక్క కేసులు, విచారణలు డైలీ సీరియల్లా సాగిపోతుంటే, టీడీపీ శ్రేణులు కూడా నిట్టూర్చుతుండగా, మరో పక్క జగన్ పరామర్శయాత్రల తీరు, జోరు పెంచి ప్రభుత్వానికి సవాళ్ళు విసురుతుంటే వైసీపీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి.
కనుక ఈ కేసులు, యాత్రలు చూస్తున్నప్పుడు వైసీపీ, కూటమి ప్రభుత్వం రాజకీయంగా దేని మీద ఏది పైచేయి సాధిస్తోంది?అనే సందేహం కలుగక మానదు.
ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణని కూడా ఇలాగే సాగదీసుకుంటూ వెళ్ళి, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించి బోర్లా పడ్డారు.
కనుక మద్యం కుంభకోణం కేసులో కూటమి ప్రభుత్వం కూడా విచారణని అలాగే ఎన్నికల వరకు సాగదీసుకుంటూ వెళ్ళి అప్పుడు జగన్‌ని అరెస్ట్ చేసి ‘సానుభూతి ఓట్లను’ వైసీపీకి పళ్ళెంలో పెట్టి అందించకుండా ఉంటే చాలు!
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…