
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి, మెడికల్ కాలేజీల నిర్మాణం, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాలు, వ్యవసాయం ప్రతీది రాజకీయాల పేరుతో వ్యతిరేకిస్తుండటం రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆయన స్వయంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, తన సొంత మీడియాతో కూడా చేయిస్తూనే ఉన్నారు.
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడుల ఎంఓయులపై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనలే జగన్ నోట వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీకి సంబందించిన ప్రతీ విషయంలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకేలా కోరస్ పాడుతుండటం గమనిస్తే, జగన్ నేటికీ కేసీఆర్ డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.
ఏపీకి అంతర్జాతీయ స్థాయి అమరావతి ఏర్పాటయితే హైదరాబాద్‌కి నష్టం జరుగుతుందని కేసీఆర్ ఆందోళన చెందడం అర్థరహితం. కానీ ఓ తెలంగాణవాదిగా ఆయన బాధ, ఈర్ష్యపడడం సహేతుకమే.
కనుక 2019 ఎన్నికలలో జగన్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి అమరావతికి బ్రేకులు వేయించారు. అంటే మన కంటినే మన వేలితో పొడుచుకునేలా చేశారన్న మాట!
అయితే అమరావతికి కేసీఆరే బ్రేకులు వేయించారని ఆరోపించడానికి ఎటువంటి ఆధారాలు లేకపోవచ్చు. కానీ అమరావతికి బ్రేకులు పడితే పరిశ్రమలు, పెట్టుబడులు ఏవిధంగా తెలంగాణకు తరలిపోయాయో అందరూ కళ్ళారా చూశారు కదా?
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించడానికే కేసీఆర్ ‘తెలంగాణ సెంటిమెంట్’ రాజేస్తున్నారని అందరికీ తెలుసు. అందుకోసమే ఏపీలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, సీఎం చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తున్నారు.
ఆయన తన పార్టీ మనుగడ కాపాడుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఇలా రకరకాలుగా ప్రయత్నించడం తప్పు కాదు.
కానీ ఏపీ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీతో జగన్ చేతులు కలపడమే చాలా తప్పు. దానికి వంతపాడుతూ ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడం ఇంకా పెద్ద తప్పని ప్రజలు భావించకుండా ఉంటారా? భావిస్తే జగన్ పరిస్థితి ఏమవుతుంది?
ఏపీని బూచిగా చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రాజేయగలిగితే మళ్ళీ అధికారంలోకి రాగలదు. కానీ దాని ఉచ్చులో చిక్కుకొని ఈవిధంగా వ్యవహరిస్తుంటే, మళ్ళీ ఎన్నటికైనా అధికారంలోకి రాగలమా లేదా? అని జగన్ వైసీపీ నేతలు ఆలోచించుకుంటే వారికే మంచిది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…