
కృష్ణాజిల్లా పెడనలో బుధవారం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మేము ఎన్డీఏలో ఉన్నప్పటికీ బయటకు వచ్చి టిడిపి కష్టకాలంలో ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే చంద్రబాబు నాయుడు అరెస్టుతో అది కాస్త బలహీనంగా ఉంది కనుక.
టిడిపి అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం కనుక. టిడిపి రాజకీయ అనుభవానికి జనసేన పోరాట పటిమ తోడైతే ఈ వైసీపి ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చని నమ్ముతున్నాము కనుక. గాడి తప్పిన రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలంటే ఈ వైసీపిని గద్దె దించక తప్పదు.
అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న వైసీపిని ఎదుర్కొని, ఓడించడానికి టిడిపి, జనసేనలు కలిసి పనిచేయడం ఒక్కటే దారి. కనుక మన రాష్ట్రం కోసం ప్రజలందరూ టిడిపి, జనసేనలకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటలను కూడా కొందరు ‘మేధావులు’ మీడియాలో కొన్ని వర్గాలు జీర్ణించుకోలేకపోవచ్చు. టిడిపికి జనసేన సాయం అవసరమా?అంటూ ప్రశ్నించవచ్చు. కానీ అదే వాస్తవం.
జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన వెంటనే మొట్టమొదట ఖండించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్డీఏలో ఉన్నప్పటికీ అవసరమైతే దానిని వాదులుకొని టిడిపితో కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తనకు ఓ పెద్దన్నలాగ వచ్చి అండగా నిలబడ్డారని నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు కూడా.
టిడిపితో కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గట్టిగా నొక్కి చెపుతున్నారు. టిడిపి కోసం బీజేపీతో స్నేహాన్ని, మోడీ, అమిత్ షాల ‘రక్షణ కవచాన్ని’ కూడా వదులుకొనేందుకు పవన్ కళ్యాణ్ సిద్దపడుతున్నారు.
అంతేకాదు… టిడిపికి మద్దతుగా పోరాడేందుకు తన సినిమా షూటింగ్‌లను వాయిదా వేసుకొని వారాహి యాత్రలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో టిడిపి, జనసేనలు కలిసి పనిచేయడం ఎంత అవసరమో చాలా స్పష్టంగా చెపుతూ, ప్రజలను కూడా ఆ దిశలో ఆలోచింపజేస్తున్నారు.
అక్కరకు రాని చుట్టము… అని సుమతీ శతకంలోని చెప్పిన్నట్లు నందమూరి కుటుంబ సభ్యులలో కొందరు చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించడానికి వెనకాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ నిర్భయంగా, మరో ఆలోచన లేకుండా ముందుకు వచ్చి టిడిపికి అండగా నిలబడి పోరాడుతున్నారని అందరూ గ్రహించాలి.
కనుక పవన్ కళ్యాణ్ మాటలలో పెడర్ధాలు వెతికి ఆయనను విమర్శించే బదులు, ఈ క్లిష్ట సమయంలో టిడిపికి ఆత్మీయుడులా వచ్చి నిలబడుతున్న పవన్ కళ్యాణ్ ప్రయత్నాలను స్వాగతించడమే వివేకం.
టిడిపి, జనసేనలను కలిపి బలమైన శక్తిగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు టిడిపి, మేధావులు కూడా మద్దతు ఇస్తే రాష్ట్రానికి మేలు కలుగుతుంది.
The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…