
టిడిపి, జనసేనలు పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చాలా సీట్లు టిడిపికి త్యాగం చేశారని విరుచుకుపడుతూ ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి పెద్దలు కాడి వదిలేసి వైసీపి పంచన చేరిపోయారు.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఆరాటపడిన వీరాభిమానులు కూడా చాలా ఆవేశపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితిని వివరించి, వైసీపిని ఓడించి అధికారంలోకి రావడం కోసం ఇటువంటి త్యాగాలు తప్పవని నచ్చజెప్పుకున్నారు. దాంతో శాంతించిన వీరాభిమానులు జనసేనకు లభించిన 24 శాసనసభ, 3 ఎంపీ సీట్లలో తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి సిద్దమవుతున్నారు.
ఇప్పుడు బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ మరో ఎంపీ సీటుని త్యాగం చేస్తున్నట్లు తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. మళ్ళీ ఆవేశపడుతున్నారు కూడా. పవన్ కళ్యాణ్ ఉదారంగా త్యాగాలు చేస్తున్నారని బాధపడుతున్నారు.
ఏపీలో బీజేపీకి పెద్దగా బలం, ఆదరణ లేనప్పుడు అన్ని సీట్లు పట్టుబట్టి తీసుకోవడం అనుమానం కలిగిస్తోంది. కనుక బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం అంటే వాటిలో కనీసం 4-5 సీట్లు బంగారు పళ్ళెంలో పెట్టి వైసీపికి అప్పగించినట్లే భావించవచ్చు.
టిడిపి, జనసేనలు ఎలాగూ ఎన్డీయేలోనే ఉంటునప్పుడు, అవి బీజేపీకే మద్దతు ఇస్తాయి కదా? మరి అలాంటప్పుడు బీజేపీ ఖచ్చితంగా గెలవలగల ఒకటి రెండు సీట్లు తీసుకుని మిగిలిన సీట్లను టిడిపి, జనసేనలకు వదిలేస్తే అవి గెలుచుకొని బీజేపీ చేతిలోనే పెడతాయిగా?కానీ బీజేపీ వాటిని వైసీపి చేతిలో ఎందుకు పెట్టాలనుకుంటోంది?
ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలపడాలని కోరుకుంటున్నట్లయితే, ఎంపీ సీట్లకు బదులు అసెంబ్లీ సీట్లు ఎక్కువ తీసుకొని ఉండాలి. కానీ లోక్‌సభ సీట్లు తీసుకుంటోంది!
పైగా వైసీపి అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్న సోము వీర్రాజు, జీవీఎల్ వంటివారికి ఆ టికెట్లు ఇచ్చి పోటీ చేయిస్తే వారే గెలుస్తారా… వైసీపిని గెలిపిస్తారా?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతీ లోక్‌సభ స్థానం పరిధిలో కనీసం అరడజను అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉంటాయి. కనుక బీజేపీ ఓడిపోయే ప్రతీ ఎంపీ సీటుతో అవన్నీ కూడా వైసీపి చేతికి వెళ్లిపోతాయి కదా?
బీజేపీ ఇన్ని సీట్లు తీసుకున్నా ఎన్నికలలో టిడిపి, జనసేనల ఓట్లు దానికి బదిలీ అవుతాయా?అంటే నమ్మకమే లేదు. బదిలీ కాకపోతే లాభపడేది ఎవరు?నష్టపోయేది ఎవరు? అని ఆలోచిస్తే బీజేపీ దురాశ వలన కూటమికి నష్టం కలిగే ప్రమాదం ఉందని అర్దమవుతోంది.
ఇటువంటి ఆలోచనలు వైసీపికి కలగకుండా ఉండవు కనుక అది తప్పకుండా బీజేపీ సీట్లని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించకుండా ఉండదు. ముఖ్యంగా టిడిపి విషయంలో జనసైనికులను ఏవిదంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందో, ఇప్పుడు బీజేపీ విషయంలో కూడా అలాగే చేయకుండా ఉండదు. కనుక టిడిపి, జనసేనలు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…
Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…