
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “రాబోయే ఎన్నికలలో నేను మళ్ళీ విశాఖ నుంచే పోటీ చేస్తాను. ఏపీకి కొత్త ఆలోచనలతో పనిచేసే యువత అవసరం ఉంది. అవసరమైతే అటువంటి వారితో కలిసి పార్టీని స్థాపిస్తాను,” అని చెప్పారు.
జేడీ లక్ష్మినారాయణ గత ఎన్నికలలో జనసేన తరపున విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. కానీ ఏ పార్టీలోను చేరలేదు. ఆయన ఆలోచనలకు దగ్గరగా ఉన్న జనసేనలో మళ్ళీ చేరుతారనుకొంటే, ఆయన సొంత పార్టీ పెట్టుకొంటానని చెప్పడం విశేషం.
ఆయన విశాఖ నుంచి పోటీ చేయవచ్చు. అదృష్టం బాగుంటే గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎన్నికలకు 4-5 నెలల ముందు కొత్త పార్టీని స్థాపించినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలంగాణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ జనసమితి పెట్టుకొని ఏళ్ళ తరబడి ఎంతగా శ్రమించినా, ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోవడంతో పోటీ చేయలేక ఆ ఆలోచన విరమించుకొన్నారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వామపక్షాలు కూడా ప్రాంతీయ పార్టీల ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. ఎన్నికల ఖర్చులను భరించలేక తడబడుతున్నాయి.
ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కూడా ఇటువంటి మంచి ఆలోచనలతోనే లోక్‌సత్తా పార్టీ పెట్టి చివరికి చేతులెత్తేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చేతులు కాల్చుకొని రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సినిమాలు చేసుకొంటున్నారు. తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ పెట్టి చేతులు కాల్చుకోవడం చూసి, రజనీకాంత్ వెనక్కు తగ్గారు.
ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్ళుగా ఏపీలో శ్రమిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా శాసనసభలో అడుగుపెట్టలేకపోయారు. పవన్ కళ్యాణ్ మొదట కులాలకు అతీతంగా రాజకీయాలు చేయాలనుకొన్నారు. కానీ ఏపీలో రాజకీయాలను కులాలు, వాటి సమీకరణాలే శాశిస్తాయనే వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించి ఈసారి ఆ లెక్కనే ముందుకు సాగుతున్నారు.
దాదాపు పదేళ్ళుగా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను చూస్తున్న జేడీ లక్ష్మినారాయణకు ఇవన్నీ తెలియవనుకోలేము. అయినా కొత్త పార్టీ ఏర్పాటు చేసుకొంటే చివరికి ఆయన కూడా చేతులు కాల్చుకోక తప్పదు.
Four people died after an electric car caught fire on the Vijayawada West Bypass. Another…
Allu Arjun is trying every possible way to stay in the pan-India limelight. Despite delivering…