
అధికార పార్టీలో ఉంటూ రాష్ట్ర నాయకత్వం పైనో, లేదా పార్టీ అధిష్టానం పైనో అలకపూని పార్టీ మారాలి అనుకోవడం ఎంత తెలివే తక్కువ పనో బిఆర్ఎస్ మాజీ మంత్రి, టి.బీజేపీ నేత ఈటెల రాజేంద్రప్రసాద్ ని చూస్తే యిట్టె అర్ధమవుతుంది.
బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేంద్రప్రసాద్ మెదక్ జిల్లాలోని అసైన్ భూముల ఆక్రమణ ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయారు. దీనితో 2021లో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరి బిఆర్ఎస్ పై ఉపఎన్నికలలో విజయం సాధించారు.
అయితే నాడు ఈటెల తన ఆత్మగౌరవం కోసం ఎవరి ముందు తలవంచను అంటూ అధికార బిఆర్ఎస్ ను వదిలి బీజేపీ లో చేరినప్పటికీ టి. బీజేపీ లో ఈటెల స్థాయికి తగ్గ రాజకీయ ప్రాధాన్యం దక్కలేదనే చెప్పాలి. ఇటు తిరిగి బిఆర్ఎస్ లోకి రాలేక టి. బీజేపీ అంతర్గత రాజకీయాలలో ఇమడలేక మెల్లిమెల్లిగా ఈటెల తన రాజకీయ అస్తిత్వాన్నే కోల్పోతున్నారు.
2023 తెలంగాణ ఎన్నికలలో బీజేపీ నేతగా హుజురాబాద్ నుంచి పోటీ చేసిన ఈటెల బిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమిని చవిచూశారు. బీజేపీ వర్గ పోరులో నలిగిపోతూ పార్టీలో ఒక రాజకీయ గుర్తింపు, గౌరవప్రదమైన పదవి లేకుండా ఉన్నారు.
దశాబ్దాల రాజకీయ అనుభవం, పాలనపరమైన అనుభవం ఉన్నప్పటికీ ఒక సామాన్య కార్యకర్తలా బీజేపీ లో ఈటెల రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది. సరిగ్గా ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా అధికార పార్టీలో ఉంటూ ఆ పార్టీ ని కాదని బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
జగిత్యాల రాజకీయాలలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన జీవన్ రెడ్డి పార్టీలోకి తన ప్రత్యర్థి సంజయ్ రాకతో పార్టీ నాయకత్వం మీద అలకపూనారు. దానికి తోడు గంగి రెడ్డి హత్య తరువాత జరిగిన పరిణామాలు, మున్సిపల్ ఎన్నికలలో టికెట్ల విషయంలో పార్టీలో తన మాట చెల్లకపోవడం,
ఇక వస్తుందనుకున్న ఎమ్మెల్సీ చేజారిపోవడం తో ఈ నెల 25 న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటనకు ముందు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడొద్దని జీవన్ రెడ్డి ని బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే జీవన్ రెడ్డి వ్యవహారం పై సీఎం రేవంత్ రెడ్డి కూడా జరిగేది జరగుతుంది అన్నట్టుగా వేచి చూసే ధోరణిలోనే ఉండడంతో జీవన్ పార్టీ మార్పుకే మొగ్గు చూపారు.
మరి జీవన్ రెడ్డి అధికార కాంగ్రెస్ ని కాదని బిఆర్ఎస్ కారెక్కుతారా.? లేదా ఈటెల మాదిరి బీజేపీ కమలం పట్టుకుంటారా.? అనేది కాలమే సమాధానం చెప్పాలి. అయితే జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయం పై యాత్ర చేసి గ్రామగ్రామాన పార్టీ విధానాలను ఎండగట్టడానికి సిద్దమయ్యాయరని సమాచారం.
Kolkata Knight Riders defeated Gujarat Titans by 29 runs in IPL 2026 on May 16.…
After the disastrous performance of Ustaad Bhagat Singh, Pawan Kalyan fans have been eagerly waiting…