ఓటమి ముందు అపశకునాలు ఏవిధంగా ఎదురవుతాయో అలాగే గెలుపు ముందు శుభ సూచికలు కూడా అలానే పలకరిస్తాయి అనేలా కొనసాగుతుంది కూటమి పార్టీల ప్రచారం. గతంలో చేయని నేరానికి నిందలు మోసిన టీడీపీ ఇప్పుడు ముందుగానే మేల్కొని వైసీపీ కి కౌంటర్లు వేస్తుంది. అలాగే గతంలో కనీసం కుటుంబ మద్దతు కూడా దక్కించుకోలేని పవన్ ఈసారి ఏకంగా సినీ ఇండస్ట్రీ నుండే మద్దతు సాధించుకోగలిగారు.
పిఠాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానూ పోటీలో తలపడుతుంది వైసీపీ అభ్యర్థి అయిన వంగా గీతతో అయినప్పటికీ నా పోరాటం వైస్ జగన్ మీదే అంటూ కుండబద్ధలుకొట్టారు. 2019 లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాలలో పోటీ చేసిన పవన్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్త ప్రచారం మీదే ద్రుష్టి కేంద్రికరించారు.
దీనికి తోడు టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేయడంతో ఈ రెండు స్థానాలలో వైసీపీ విజయ బావుటా ఎగరవేయగలిగింది. తానూ స్థానికంగా ప్రచారానికి అందుబాటులో ఉండకపోవడం, బూత్ లెవెల్ మానేజ్ మెంట్ చేసే నాయకులు లేకపోవడం దానికి తోడు తన కోసం ప్రచారం చేయడానికి కనీసం కుటుంబ సభ్యులు కూడా ముందడుగు వేయకపోవడం అన్ని పవన్ ఓటమిని నిర్దేశించాయి.
కానీ ఈసారి పిఠాపురంలో ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. పిఠాపురంలో టీడీపీ తరుపున బలమైన నాయకుడు వర్మ, ఆయనకు బూత్ లెవెల్ వరకు ఉన్న క్యాడర్ ఉండడంతో పవన్ తన గెలుపు బాధ్యతను వర్మ భుజాల మీద పెట్టారు. దీనికి తోడు అన్న నాగబాబు స్వయంగా పిఠాపురంలోనే మకాం వేసి అటు జనసైనికులను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే బుల్లి తెర స్టార్ కమీడియాన్స్ జబర్దస్త్ బ్యాచ్, సీరియల్ నటులు మొత్తం పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ప్రతి ఇంటి గడప తడుతున్నారు.
మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి పవన్ వదిన నాగబాబు సతీమణి పద్మజ ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అలాగే కుమారుడు వరుణ్ తేజ్, మెగా మేనల్లుళ్లు సాయి ధర్మ తేజ్, వైష్ట్నవ్ తేజ్ పిఠాపురంలో పవన్ గెలుపు కోసం రోడ్ షో వంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ పిఠాపురం వాసులను మెప్పించారు. ఇక ఇండస్ట్రీ పెద్దన్నగా భావించే చిరంజీవి కూడా తన తమ్ముడు కోసం ఒక అడుగు ముందుకేశారు.
పవన్ ను గెలిపించాలి అంటూ పిఠాపురం వాసులకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు చిరు. చిరు బాటలోనే బాబాయ్ కోసం చరణ్, మామయ్య కోసం బన్నీ కూడా పవన్ కు తమ మద్దతు తెలియచేసారు. అలాగే హీరో నాని, రాజ్ తరుణ్ లు కూడా పవన్ గెలుపుని కాంక్షిస్తూ పవన్ కు అండగా నిలిచారు. 2019 ఎన్నికలో జనసేన ఒంటరిగా పోటీ చేసిన సమయంలో కూడా పవన్ కు దక్కని మద్దతు 2024 ఎన్నికలలో కేవలం 21 స్థానాలలో పోటీ చేస్తున్నప్పటికీ ఇంతమంది ప్రముఖుల, కుటుంబ సభ్యుల మద్దతు సాధించుకోగలిగింది.
పవన్ చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అనేది పవన్ విషయంలో స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, వైసీపీ వంటి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం తానూ 21 స్థానాలకు తగ్గి కూటమికి పెద్ద దిక్కుగా నిలబడి, వైసీపీ తో తలబడుతున్న పవన్ కు ఇంతమంది మద్దతు దక్కడం అంటే పవన్ తగ్గి నెగ్గినట్టే..!






