
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని ఈ నెల 26న ఢిల్లీలోని విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీస్ పంపింది. గమ్మతైన విషయం ఏమిటంటే, దీనిపై బిఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితతో సహా ఎవరూ స్పందించలేదు కానీ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
గతంలో ఈడీ విచారణకు రమ్మంటే ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అంటూ హడావుడి చేసిన కల్వకుంట్ల కవిత, బిఆర్ఎస్ నేతలు, ఇప్పుడు విచారణకు రమ్మనమని సీబీఐ పంపితే ఒక్క ముక్క మాట్లాడటం లేదు.
కానీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందిస్తూ, “లోక్‌సభ ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీస్ పంపడం వెనుక బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకే ఆ రెండు పార్టీలు కలిసి ఈ కొత్త డ్రామా మొదలు పెట్టాయని భావిస్తున్నాం,” అని అన్నారు.
శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి ఢీలాపడిన కేసీఆర్‌కి వెంటనే వస్తున్న ఈ లోక్‌సభ ఎన్నికలు మరో అగ్నిపరీక్షలా మారాయని చెప్పక తప్పదు. ఒకవేళ ఈ ఎన్నికలలో కూడా ఓడిపోతే బిఆర్ఎస్ పార్టీ చిన్నాభిన్నం అయిపోయే ప్రమాదం ఉంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈవిదంగానైనా కేసీఆర్‌కు తోడ్పడాల్సిన అవసరం ఏమిటి?అంటే బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయే తప్ప కేసీఆర్ కాదు కనుక!
కేసీఆర్‌కున్న సమస్యల వలన మోడీ, అమిత్ షాలకు విధేయంగా ఉండక తప్పదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి ఆవిదంగా ఉండలేరు. ఉంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించేస్తుంది.
ఇదీగాక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా నిలద్రొక్కుకుంటే, రాష్ట్రంలో బీజేపీకి మరో బలమైన శత్రువు తయారవుతుంది. కనుక కాంగ్రెస్ కంటే తనకు విధేయంగా ఉండేందుకు సిద్దంగా ఉన్న కేసీఆర్‌కి సహకరించడానికే మోడీ, అమిత్ షాలు మొగ్గు చూపడం సహజం.
అందుకే బిఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ రాజేసుకుని ఒడ్డున పడేసేందుకే కేంద్రం సీబీఐ ద్వారా నోటీస్ పంపి ఉండవచ్చని జగ్గారెడ్డి భావిస్తున్నారు.
ఒకవేళ ఈ కేసులో కల్వకుంట్ల కవితని సీబీఐ అరెస్ట్ చేస్తే, బిఆర్ఎస్ పార్టీ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టకుండా ఉండదు. అప్పుడు ప్రజలకు సానుభూతి కలిగి బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తారు కదా?
ఈడీ నోటీస్ పంపితే సుప్రీంకోర్టులో కేసు వేసిన కల్వకుంట్ల కవిత, సీబీఐ నోటీసుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయకపోవడం కూడా ఇదే సూచిస్తోంది. కనుక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన ఈ వాదనలో ఎంతో కొంత నిజముందని భావించవచ్చు. కేసులతో వేధింపులే కాదు… వాటిని ఈవిదంగా కూడా ఉపయోగించుకోవచ్చని బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు నిరూపించి చూపిస్తాయేమో?
Rumours around the Allu Arjun-Lokesh Kanagaraj project just refuse to die down. A couple of…
A new pairing, a contemporary love story, and a team making its first steps into…