
కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆమెకు కాంగ్రెస్, బిజేపిల విషయంలో స్పష్టత ఉంది. కానీ సుమారు 20 ఏళ్ళపాటు పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ విషయంలో స్పష్టత లేదనిపిస్తుంది. ఓసారి ఆమె బీఆర్ఎస్ పార్టీ లైన్ తీసుకొని మాట్లాడుతుంటారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంటారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు అచ్చం కేటీఆర్, హరీష్ రావు మాటలను యధాతధంగా వల్లిస్తుంటారు. కానీ హరీష్ రావుని గుంటనక్క అని, కేటీఆర్ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తుంటారు!
తండ్రి ఫోటో తీసేసి జాగృతి కండువాలపై తన ఫోటో వేయించుకున్న తర్వాత ఆమె తండ్రిని నేరుగా విమర్శించడం లేదు. కానీ అయన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల జాబితాలు గడగడా చదువుతున్నారు.
తన తండ్రి అల్లుడి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారని ఆక్షేపించారు. కానీ సిట్ అధికారులు నిన్న హరీష్ రావుని ఈ కేసులో విచారణ చేయడంపై స్పందిస్తూ, “గుంటనక్క (హరీష్ రావు), గుంపు మేస్త్రి (సిఎం రేవంత్ రెడ్డి) ఇద్దరూ కలిసే మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ నాటకం ఆడుతున్నారు. కనుక ఈ కేసు విచారణతో ఒరిగేదేమీ ఉండదు,” అని కవిత అన్నారు.
అంటే ఆమె ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేసి సూత్రధారులను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. కనుక సిట్ అధికారులు ఆమెకు నోటీస్ ఇచ్చి పిలిపిస్తే ఈ కేసులో తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌లే సూత్రధారులని ఆమె చెప్తారా? చెప్పగలరా? అనుమానమే. ఈ లెక్కన ఆమె ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారనుకోవాలేమో?
ఆమె బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు కనుక ఆ పార్టీని విమర్శించక తప్పడం లేదు. అప్పుడే ప్రజలు తనని నమ్ముతారని ఆమెకు తెలుసు.
కానీ తండ్రి, అన్న కారణంగా బీఆర్ఎస్ పార్టీపై పూర్తి స్థాయిలో కత్తులు దూయలేరు కూడా. ఇక్కడే ఆమె విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఆమెలో ఈ సందిగ్దత ఉన్నంత కాలం ప్రజల నమ్మకం పొందలేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరినీ ఆకర్షించలేరు.
అలాగని తండ్రి కేసీఆర్‌ని, అన్న కేటీఆర్‌లను రాజకీయ శత్రువులుగా పరిగణింఛి ధీటుగా ఎదుర్కోలేరు. ఈ సందిగ్ధంలో కొనసాగుతూ కొత్త పార్టీతో రాజకీయ ప్రయోగం చేస్తే చేతులు కాల్చుకునే అవకాశాలే ఎక్కువ.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…