
సమాజం హత్యలు చేస్తుందా? అంటే చేయదనే చెప్తారు. కానీ చేస్తుంది. ఇందుకు ఇదొక తాజా నిదర్శనం.
తెలంగాణలో కరీంనగర్ జిల్లా కోరుట్ల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్నాడు దేశ్ చంద్రశేఖర్. అతని భార్య పేరు దివ్య. ఐదు రోజుల క్రితం కడుపు నొప్పి భరించలేక గన్నేరుపప్పు నూరుకొని తినేసింది. కానీ అది తిన్న తర్వాత డ్యూటీలో ఉన్న భర్తకు ఫోన్ చేసి ఈవిషయం చెప్పడంతో అతను హుటాహుటిన వచ్చి ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు.
కానీ అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున వైద్యుల సూచన మేరకు ఆమెను హుటాహుటిన హైదరాబాద్ తీసుకువెళ్ళి ఓ కార్పోరేట్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించాడు. కానీ ఆమె చనిపోయింది!
అమితంగా ప్రేమించే భార్య తన చేతుల్లోనే చనిపోవడం చూసి తట్టుకోలేక ఎస్సై చంద్రశేఖర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, తల్లితండ్రులు, అత్తమామలు కూడా ఓదార్చలేకపోయారు.
కానీ మీడియా, సోషల్ మీడియాలో ఈ వార్త వేరేలా వచ్చింది. ఎస్సై భార్య కడుపునొప్పితో ఆత్మహత్య? నిజమేనా? ఆమె మరణానికి భర్త చంద్రశేఖరే కారణమా?అతని వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుందా?అంటూ నిజానిజాలు ద్రువీకరించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్రాసి పడేశారు. వాటిని చూసి ఇరుగు పొరుగులు కూడా అతనినే అనుమానించారు.
అసలే భార్య పోయిన దుఃఖంలో ఉన్న ఎస్సై చంద్రశేఖర్ ఈ ఆరోపణలు భరించలేక ఇంకా కుమిలిపోయాడు. నేడు 5వ రోజున ఆనవాయితీ ప్రకారం శ్మశానంలో కాకులకు ఆహరం పెట్టి మావగారి ఇంటికి తిరిగివచ్చి ఉరేసుకొని చనిపోయాడు!
ఐదు రోజుల వ్యవధిలో కొడుకు, కోడలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినందుకు అతని తల్లి తండ్రులు, కూతురు అల్లుడు చనిపోయినందుకు ఆమె తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది సమాజం చేసిన హత్యే కదా? లేకుంటే చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకొనేవాడా?
Crazy Kalyanam is moving ahead of its theatrical release by arriving earlier than originally planned.…
There is a different side of Teja Sajja to be seen in The Traitors Telugu.…