
సినిమా వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నట్లే రాజకీయ నాయకులకీ కొన్ని ఉంటాయి. వాటిలో భద్రాచలం, వేములవాడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, వాస్తు దోషం ఉన్న సచివాలయంలో అడుగు పెట్టినా మంత్రి పదవులు పోతాయనే భయం, నమ్మకాలున్నాయి.
ఆ తర్వాత మార్నింగ్, ఈవెనింగ్, నైట్ లైట్ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షలు కూడా ట్రెండింగ్ అయ్యాయి. వాటితో కూడా ముఖ్యమంత్రులైన వారున్నారు.
ఆ తర్వాత పాదయాత్రల ట్రెండ్ మొదలైంది. దాంతో కొందరు ముఖ్యమంత్రులు అయ్యారు. కనుక గల్లీ స్థాయి నాయకులు కూడా ఎందుకైనా మంచిదని ఆమరణ నిరాహార దీక్షలు, వాతావరణం అన్నీ చూసుకొని ఓ వంద అడుగుల పాదయాత్రలు చేసేస్తున్నారు.
పాదయాత్రల తర్వాత జైలు ట్రెండింగ్ అయ్యింది. జైలుకి వెళ్ళివచ్చిన వారు ముఖ్యమంత్రులు అవుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది నాయకులు జైలుకి వెళ్ళేందుకు ఆరాటపడుతున్నారు.
జగన్ హయంలో ఆ భాగ్యం దక్కినవారందరూ మంత్రులు, ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ఇప్పటికే సిఎం అయ్యారు. ఇప్పుడు వైసీపీలో చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, అంబటి రాంబాబు మొదలు భార్గవ రెడ్డి వరకు అనేక మంది ఈ ప్రాధమిక అర్హత సాధించి తమ టైమ్ కోసం కళ్ళు మూసుకొని ఎదురుచూస్తున్నారు.
మళ్ళీ తెలంగాణలో తొంగి చూస్తే రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది లోనికి వెళ్ళివచ్చి ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యారు.
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఆరు నెలలు బలమైన పునాది వేసుకున్నారు. కనుకనే ఆమె కూడా అంత నమ్మకంగా ‘తర్వాత నేనే ముఖ్యమంత్రిని’ అనగలుగుతున్నారు!
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్ అందరూ లోనికి వెళ్ళి వచ్చారు. ఆ ప్రాధమిక అర్హతని వారు వరుసగా రెండుసార్లు వాడేసుకున్నారు. అయినప్పటికీ వారు కాస్త సహకరిస్తే లోపల వేయడానికి సిఎం రేవంత్ రెడ్డి సిద్ధంగానే ఉన్నారు. కానీ సహకరించడం లేదు. ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తే 2028 ఎన్నికలలో దాని ‘ఎఫెక్ట్’ పని చేస్తుందో లేదో అని తొందరపడటం లేదేమో?
కానీ ఇప్పుడు ఇదివరకులా జైళ్ళలో ఇబ్బందులు లేవు. శశికళ బెంగళూరు జైలులో ఉన్నప్పుడు బయటకు వెళ్ళి షాపింగులు వగైరా చేసుకుంటూ నాలుగేళ్ళు హాయిగా గడిపేశారని కర్ణాటక జైళ్ళ శాఖ ఉన్నతాధికారి ఒకరు కనిపెట్టి చెప్పారు. అందుకు ఆమె బలైపోయింది అది వేరే సంగతి.
కానీ లోపల రాజభోగాలు ఉంటాయని ప్రాధమిక అర్హత సాధించిన మిథున్ రెడ్డి, అంబటి రాంబాబు వంటి వారు తెలియజేశారు. ఇలా జైలుకి వెళ్ళివచ్చిన వాళ్ళ కబుర్లు చెప్పుకుంటే అసలు విషయం పక్కకు వెళ్ళిపోతుంది.
కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి పదవికి ప్రాధమిక అర్హత సాధించి టీఆర్ఎస్ పార్టీ పేరు హైజాక్ చేసి దూసుకుపోతున్నారు. మద్య మద్యలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కూడా. కనుక ఆమె ‘ప్రీ-క్వాలిఫైడ్’ కేటగిరీలోకి వచ్చేసినట్లే.
ఆమె ఎవరు వదిలిన బాణమో కేసీఆర్, కేటీఆర్‌తో రాజకీయాలలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. కానీ అబ్బా ఎండలు, వేడి అంటూ ధర్నాలు, దీక్షలు చేయకుండా కేటీఆర్ ఇంట్లో కూర్చుంటే ఆయనకే నష్టం. కనుక కాస్త ఎండలు తగ్గాకైనా ఓ రౌండ్ లోపలకి వెళ్ళి వచ్చేస్తే మంచిది. లేకుంటే ప్రాధమిక అర్హత సాదించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి లాంటివాళ్ళతో కూడా పోటీ పడాల్సి రావచ్చు.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…