
kavitha-kodangal-political-rally
ఆటలో అరటిపండు.. అంటే ఇదేనేమో? తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు, కేసీఆర్ నేతృత్వంలోని ఓ బలమైన ప్రాంతీయ పార్టీ మద్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతుంటే, రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందన్నట్లు కల్వకుంట్ల కవిత తెలంగాణను రక్షిస్తానంటూ రక్షణసేనతో బరిలో దిగారు.
ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే వాదన వినిపిస్తుంటుంది. కాదని నిరూపించేందుకు ఆమె ఈరోజు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ బయలుదేరారు. అక్కడ ఆమె ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించబోతున్నారు.
పాంచజన్యం పూరించడం అంటే యుద్ధానికి ఆహ్వానమే కనుక రేవంత్ రెడ్డి కంచుకోటపై దాడికి బయలుదేరినట్లు సుమారు రెండువందల కార్లతో ర్యాలీగా వెళ్తున్నారు.
రేవంత్ రెడ్డిని దెబ్బ తీసేందుకు ఆమె తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఇది తెలిసీ కూడా ఆమె ఇన్ని కార్లు వేసుకొని కొడంగల్ బయలుదేరడం చూస్తుంటే, ఓ సినిమాలో బ్రహ్మాజీ-తనికెళ్ళ భరణి మద్య సాగిన సంభాషణ గుర్తు వస్తే తప్పు కాదు.
హీరోని కొట్టేందుకు ఒక్కో జంక్షన్ వద్ద రెండు మూడు సుమోలు పెట్టానని బ్రహ్మాజీ గొప్పగా చెప్తే, ఒక్కడిని కొట్టేందుకు అన్ని సుమోలు దేనికిరా? పెట్రోల్ దండగ.. అని తనికెళ్ళ భరణి అంటారు. కల్వకుంట్ల కవిత కూడా అలాగే బయలుదేరుతున్నారేమో అనిపిస్తుంది.
ఈ కార్ల ర్యాలీతో తన వెంట చాలా మంది ఉన్నారని చెప్పుకోవడానికి పనికివస్తుంది. కానీ అన్ని కార్లతో ర్యాలీ అంటే ఖర్చు తడిపిమోపేడు అవుతుంది. ఇలాంటి ర్యాలీలు, పంచజన్యాలకు అయ్యే ఖర్చులు ఆమె పెట్టుకుంటున్నారంటే పార్టీని మెయిన్‌టెయిన్ చేయగలరని రాజకీయ నాయకులకు నమ్మకం కలుగుతుంది. ఇది ఒక కారణం కావచ్చు.
లేదా ఆమెపై నమ్మకంతో ఇంత మంది జేబులో నుంచి తీసి ఖర్చు పెడుతున్నారంటే అది కూడా రాజకీయాలలో ఓ బలమైన సంకేతమే. గతంలో ఆమె తండ్రి కేసీఆర్ మహారాష్ట్రపైకి సుమారు 500-600 కార్లతో దండయాత్రకు వెళ్ళడం కూడా అందుకే. కనుక కవిత ఈ ఫార్ములా కూడా ఫాలో అవుతున్నారని సరిపెట్టుకోవచ్చు.
కానీ మూడు పార్టీల మద్య రాజకీయ ఆధిపత్యపోరు సాగుతుంటే, ఆమె పూరించే పాంచజన్యం వినేందుకు ఎవరికైనా ఆసక్తి ఉంటుందా? ముఖ్యంగా గులాబీ తానులో ముక్కగా, నేటికీ ‘కల్వకుంట్ల’ బ్రాండ్ ఇమేజ్ వాడుకుంటున్నప్పుడు, తనను ప్రజలు ఎందుకు నమ్మాలి? అని ఆమె ఆలోచిస్తున్నారో లేదో?
There is an uncomfortable pattern in recent Telugu commercial cinema. Sexual violence, sexual threats and…
కేసులో ఓడినవాడు కోర్టు వద్దే ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడన్నట్లు, జగన్-షర్మిల మద్య యుద్ధాలు కొనసాగితే వారికి కూడా…