
తెలంగాణలో కేసీఆర్ రాజ్యం నడుస్తున్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో గల్లీ స్థాయి కార్యకర్తలు కూడా బోరవిరుచుకు తిరిగేవారు. అలాంటిది ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఓ వెలుగు వెలగకుండా ఉంటారా? ప్రభుత్వంలో, పార్టీలో చక్రం తిప్పకుండా ఉంటారా?
అధికారులు, బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రజలు ఆమెను ఓ యువరాణి అన్నట్లు సగౌరవంగా చూసుకునేవారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో ఆమె హవా అలాగే సాగింది. అన్నేళ్ళలో సచివాలయంలో తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే ఆలోచన రాలేదు.
జ్యోతీరావు ఫూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకోలేదు. బీసీలకు42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని అడగలేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని అడగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు వంటి సీనియర్ నాయకులే భారీగా అవినీతికి, అక్రమాలకూ పాల్పడుతున్నారని తెలిసి ఉన్నా ఏనాడూ కల్వకుంట్ల కవిత ప్రశ్నించలేదు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత ఆమెకు ఇవన్నీ వరుసగా గుర్తుకొస్తున్నాయి. వీటన్నిటి గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
సిఎం రేవంత్ రెడ్డికి వీటన్నిటిపై చిత్తశుద్ది ఉందా? అని నేడు నిలదీసే బదులు నాడు తన తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయననే నిలదీసి ఉంటే ఇవన్నీ అప్పుడే ఏర్పాటు అయ్యి ఉండేవి కదా?
నాడు రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ మాకు ఈ ‘తెలుగు తల్లి’ వద్దని ఏకపక్షంగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయించారు.
ఇప్పుడు ఆ తల్లి మాకొద్దని సిఎం రేవంత్ రెడ్డి మరో తల్లి విగ్రహం ఏర్పాటు చేఇస్తున్నారు. కవిత స్పందిస్తూ, “చేతిలో అధికారం ఉంది కదాని ప్రజలపై తన నిర్ణయాన్ని బలవంతం రుద్దుతున్నారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అంటే ఇదే! అంటే తన తండ్రి ఏం చేసినా ఒప్పు… మరెవరు చేసినా తప్పని కవిత చేపుతున్నారన్న మాట!
నాడు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కాలులో ముల్లు గుచ్చుకుంటే నాలికతో తీస్తానంటూ కేసీఆర్ చప్పట్లు కొట్టించుకున్నారు. కానీ సిఎం అయిన తర్వాత వారు 55 రోజులు సమ్మె చేస్తే వారి పట్ల కేసీఆర్ అతి క్రూరంగా వ్యవహరించారు. అప్పుడూ కవితకి తప్పనిపించలేదు.
సమ్మె సమయంలో ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో, ఆందోళనతో సుమారు 40 మంది కార్మికులు చనిపోయారు. వారిలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కేసీఆర్ కనికరించలేదు. కవిత ఏమని తండ్రిని ప్రశ్నించలేదు.
ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం గురించి అసలు పట్టించుకోవడం లేదని కవిత విమర్శలు గుప్పిస్తున్నారు!
తాను బీఆర్ఎస్ పార్టీ కంటే గొప్పగా ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నానని అనుకుంటున్నారే తప్ప తాను కూడా ‘ఆ తానులో ముక్కనే’ అనే సంగతి మరిచిపోతున్నారు.
కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి వేసే ఇటువంటి ప్రతీ ప్రశ్నకు ఆమె కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆమె వద్ద సమాధానాలు ఉంటే ప్రజలు ఆదరిస్తారు. లేకుంటే జనసేనని ఉద్దేశ్యించి ఆమె చెప్పినట్లుగానే ఆమె పార్టీ కూడా ‘ఓపెన్ అండ్ షట్ పార్టీ’ అవుతుంది.
Shah Rukh Khan's King already has one of the biggest ensemble casts among upcoming Hindi…
A viral claim that Virat Kohli was paid Rs. 5 crores to visit Premanand Maharaj’s…