
ఏపీలో జగన్-షర్మిల, తెలంగాణలో కేటీఆర్-కవితల మద్య వారసత్వపోరు రాజకీయ పోరుగా మారడం ఆ రెండు పార్టీలకు చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. కానీ రెండు పార్టీల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది.
జగన్-షర్మిల పోరు మొదలైనప్పుడు ఏపీ ప్రజలు ఆసక్తిగా గమనించారు. వారిరువురి పోరాటం ఏ రాజకీయ మలుపు తిరుగుతుందోననే ఉత్కంట ఏర్పడింది. కానీ క్రమేపీ ఆమె జగనన్నపై చేసే విమర్శలు, ఆరోపణలపై ప్రజలు కూడా ఆసక్తి కోల్పోయారు. పైగా ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పూర్తిగా చతికిలపడింది. ఇది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి చాలా ఊరటనిచ్చేదే. ఇంతకాలంలో ఆమె ఒక్క వైసీపీ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించలేకపోయారు.
ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏమాత్రం విలువలేదని స్పష్టమైవడంతో జగన్ మళ్ళీ కూటమి ప్రభుత్వంపై పూర్తిగా దృష్టి పెట్టి యుద్ధం చేయగలుగుతున్నారు. షర్మిల అడపా దడపా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ రాజకీయ కాలక్షేపం చేస్తున్నట్లే భావించవచ్చు. కనుక ఆమె వలన జగన్‌కు రాజకీయంగా ఎటువంటి ప్రమాదమూ లేదని భావించవచ్చు.
కానీ తెలంగాణలో కేటీఆర్-కవితల పోరులో ప్రస్తుతానికి ఆమెదే పైచేయిగా కనిపిస్తోంది. కేటీఆర్ వెనుక యావత్ గులాబీ దండు ఉన్నప్పటికీ ఆమెను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు.
కేసీఆర్ కూతురిగా ఆమెకు తెలంగాణలో మంచి పేరు, పరపతి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత అతి తక్కువ సమయంలోనే ఆమె తనకంటూ సొంతంగా ఓ గుర్తింపు, అనుచరగణం సృష్టించుకున్నారు కూడా. ఈ ధైర్యంతోనే ఇప్పుడామె సొంతంగా పార్టీ కూడా పెడుతున్నారు. ఆమె పార్టీ పెట్టి గేట్లు తెరిస్తే మొట్టమొదట బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలే వస్తారనేది రహస్యమేమీ కాదు.
కనుక ఆమె వలన బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా తన రాజకీయ వారసుడు కేటీఆర్‌కి నష్టం కలగకూడదని కేసీఆర్ భావిస్తే నేడు జగిత్యాల సభలో ఆమెపై కుటుంబం, పార్టీ, రాష్ట్ర ద్రోహి ముద్రలు వేయవచ్చు.
ఒకవేళ ఆమెని బయటకు పంపించి పార్టీ పెట్టించడం కూడా కేసీఆర్ గేమ్ ప్లానులో భాగమే అయితే నేటి సభలో ఆమె ప్రస్తావన చేయకుండా సొంత డబ్బా కొట్టుకొని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి మళ్ళీ ఫామ్‌హౌసులోకి వెళ్ళిపోతారు.
ఏది ఏమైనప్పటికీ షర్మిల వలన జగన్‌కు జరిగిన నష్టం కంటే, కవిత వలన కేటీఆర్‌కి బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. షర్మిల కథ ముగిసిపోయింది కానీ కవిత కథ ఇప్పుడే మొదలవుతోంది. కనుక క్లైమాక్స్ సీన్ కేసీఆర్‌పైనే ఆధారపడి ఉంది.
Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…
హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…