తెలుగు రాజకీయాల సెంటిమెంట్ కవిత కు శాపం కానుందా.?

భారతీయ సంస్కృతిలో ఆచారాలు, సంప్రదాయాలు ఎలా అయితే మిళితమైపోయాయో అలాగే సెంటిమెంట్లు కూడా వారి జీవితంలో భాగమైపోయాయి. ఇందుకు సాధారణ పౌరుడు నుంచి సెలబ్రెటీ వరకు ఎవరు అతీతులు కారు, కాలేరు అనే గట్టి బలమైన నమ్మకం మన భారతీయ సమాజంలో వేళ్ళూరుకుపోయింది.

అయితే ఇప్పుడు అటువంటి సెంటిమెంట్ ఒకటి తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఎన్నో ఏళ్ళ నుంచి పట్టి పీడిస్తుంది. అయితే ఆ సెంటిమెంట్ శాపానికి కవిత కూడా బలవబోతున్నారా.? లేక బయటపడనున్నారా.? అనేది కాలమే బదులు చెప్పాలి.

ADVERTISEMENT

అసలు విషయానికొస్తే.., బిఆర్ఎస్ తో రాజకీయ ఋణానుబంధాన్ని తెంచుకున్న కల్వకుంట్ల కవిత మరో కొత్త పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించబోతున్నారు అంటూ మీడియాలో వార్తలు తెగ హడావుడి చేస్తున్నాయి. అలాగే ఆ ఊహాగానాలకు బలం చేకూరేలానే కవిత రాజకీయ అడుగులు కానీ ప్రకటనలు కానీ కనిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో మహిళా రాజకీయ పార్టీలకు శాపంగా మారిన ఒక సెంటిమెంట్ కవిత కొత్త పార్టీ నిర్ణయం పైన ఆమె తరువాత రాజకీయ ప్రయాణం మీద పలు సందేహాలను లేవనెత్తుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు విభజిత తెలుగు రాష్ట్రాల వరకు మహిళల చేత నిర్మించబడిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా మనుగడ సాగించలేదు.

ఇందుకు ఎన్నో ఉదాహరణలుగా, ఎంతో మంది మహిళా రాజకీయ నేతలు, వారు స్థాపించిన రాజకీయ పార్టీల ప్రస్థానం ప్రత్యక్ష సాక్ష్యాలుగా కవిత ముందు నిలుస్తున్నాయి. ఇందులో మొదటి మహిళా నేత లక్ష్మీ పార్వతి. ఈమెకు ఎటువంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ ఎన్టీఆర్ సతీమణి అనే ఒకేఒక్క బ్రాండ్ లక్ష్మీ పార్వతిని కొత్త పార్టీ ఏర్పాటు వరకు తీసుకెళ్లగలిగింది.

అందులో భాగంగా 1996 లో ‘ఎన్టీఆర్ తెలుగు దేశం’ అంటూ తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పార్టీ అధినేతగా అడుగుపెట్టారు లక్ష్మీ పార్వతి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ని కాదని బాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ కి పట్టం కట్టారు.

అయితే కొన్ని ఏళ్ళ నిరీక్షణ తరువాత కూడా తెలుగు ప్రజలు లక్ష్మీ పార్వతి స్థాపించిన ఎన్టీఆర్ తెలుగు దేశం వైపు కన్నెత్తి కూడా చూడకపోయేసరికి ఆ పార్టీ తెలుగు రాజకీయ కాలగర్భంలో కలిసి కనుమరుగైపోయింది. ఇక ఆ తరువాత తెలుగు రాష్ట్ర రాజకీయాలను ‘తల్లి తెలంగాణ’ పేరుతో పలకరించారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.

తనకున్న సినీ ఛరిష్మాతో 2005 ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. కానీ ఆనాటి రాజకీయ పరిస్థితులకు తలొగ్గి తన తల్లి తెలంగాణ పార్టీని కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి ఇక అక్కడి నుంచి వలస రాజకీయ వాదిగా పార్టీ జెండాలు మారుస్తూ ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎజెండాలో కలిసి ప్రయాణం చేస్తున్నారు.

అలాగే ఏపీకి సంబంధించిన అరకు గిరిజన ప్రాంతానికి చెందిన కొత్తపల్లి గీత 2018 న ‘జన జాగృతి’ పేరుతో గిరిజనుల హక్కుల పోరాటం అంటూ కొత్త రాజకీయ పార్టీని స్థాపించింది. అయితే గీత స్థాపించిన రాజకీయ పార్టీ జనాన్ని జాగృతం చెయ్యలేక, ఎన్నికల గీత దాటలేక పునాది వేసుకున్న చోటే సమాధయ్యింది.

ఇక తెలంగాణలో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తాను, ఇక్కడ రాజన్న రాజ్య పాలన తెస్తాను అంటూ నేను ఆడపిల్లను కాను ఈడ పిల్లను అంటూ ఏపీని కాదని, అన్న స్థాపించిన వైసీపీ ని వద్దని తెలంగాణలో 2021 లో టి.వైఎస్ఆర్ పార్టీని స్థాపించి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసింది వైస్ షర్మిల.

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా షర్మిల సాగించిన టి. వైఎస్ఆర్ రాజకీయ పోరాటం చివరికి కాంగ్రెస్ పార్టీ లో విలీనం తో ముగిసింది. ఇలా తెలుగు నాట మహిళల చేత స్థాపించబడిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు రాజకీయ మనుగడ సాగించింది లేదు.

అలాగే రాజకీయంగా బలపడిన దాఖలాలు కానీ, తమ పార్టీ రాజకీయాలతో తెలుగు రాష్ట్ర రాజకీయాలలో బలైమైన ముద్ర వేసిన ఆనవాళ్లు కానీ కనిపించడం లేదు. దీనితో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో మహిళా రాజకీయ పార్టీలకు “ఓటమి – విలీనం” అనే సెంటిమెంట్ ఒక శాపంగా వెంటాడుతుందా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

మరి అటువంటి సెంటిమెంట్ శాపాన్ని దాటుకుని కవిత తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కొత్త పార్టీ తో రాణించగలదా.? ఇప్పటి వరకు ఒక లెక్క ఇకనుంచి మరోలెక్క అంటూ తెలంగాణ రాజకీయాలలో కవిత తనదైన ముద్ర వేయగలరా.?

ఓటమి – విలీనం అనే చరిత్రను కవిత రాజకీయం చెరపగలదా.? ఇన్నాళ్ళుగా పురుషాధిపత్యంగా సాగుతున్న తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని కవిత తన కొత్త పార్టీ తో మార్చబోతున్నారా.? ఇలా అనేక ప్రశ్నలు కవిత భవిష్యత్ కార్యచరణ చుట్టూ అల్లుకున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

16 minutes ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

35 minutes ago